EPFO Pension: నవంబర్ 19న కీలక భేటీ.. పెన్షన్ 3 రెట్లు పెరుగుతుందా?
దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు త్వరలోనే ఒక మంచి వార్త అందుతుందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 240వ సమావేశం నవంబర్ 19న న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం ఇస్తున్న కనిష్ట నెలవారీ పెన్షన్ను ఏకంగా మూడింతలు పెంచే ప్రతిపాదనపై కీలక చర్చ జరగనున్నట్లు ఆర్థిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రూ. 1,000 నుంచి రూ. 3,000కు పెంపు?
ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులకు అందుతున్న కనీస నెలవారీ పెన్షన్ రూ. 1,000గా ఉంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తాన్ని కనీసం రూ. 3,000కు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఆర్థిక శాఖతో ప్రాథమిక సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఈపీఎఫ్ఓ నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నవంబర్ 19 నాటి భేటీలోనే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉంది.

దశాబ్ద కాలంగా మారని పెన్షన్
ఈపీఎస్ కింద రూ. 1,000 కనీస పెన్షన్ను చివరిగా 2014 సెప్టెంబర్లో అమలులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత గడిచిన 12 ఏళ్లలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినప్పటికీ పెన్షన్ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదు. దీనిపై కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. కనిష్ట పెన్షన్ను కనీసం రూ. 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. 2014 నాటి ధరలకు ఇప్పటి జీవన వ్యయానికి ఎంత మాత్రం పొంతన లేదని, నెలకు వెయ్యి రూపాయలతో కాలం వెళ్లదీయడం అసాధ్యమని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 19 భేటీపైనే ఆశలన్నీ
వాస్తవానికి ఈ సీబీటీ సమావేశాన్ని గుజరాత్లోని గిర్ ప్రాంతంలో నిర్వహించాలని మొదట భావించారు. కానీ చివరి నిమిషంలో వేదికను మార్చి న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 19న ఉదయం 10:15 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో గనుక కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఈపీఎస్ పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండడం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
