బై ఆన్ డిప్ ఫార్ములా: బంగారం కొనుగోళ్లకు ఇది మంచి సమయమేనా..?
దేశీయ నగల మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరిగిన ధరలకు బ్రేక్ పడుతూ, స్థానిక మార్కెట్లలో అమ్ముకాల ఒత్తిడి తీవ్రమైంది. ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. బంగారాన్ని కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అంతుచిక్కట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
శుక్రవారం నాడు ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర ఏకంగా రూ. 2,700 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,55,900 వద్ద స్థిరపడింది. సామాన్య కొనుగోలుదారులకు ఈ ధరల తగ్గుదల కొంత ఉపశమనం కలిగించినట్టయింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఊహించని విధంగా భారీగా దిగొచ్చాయి. మార్కెట్ ముగింపు సమయంలో కిలో వెండి రూ. 2,44,600 వద్ద ఉండగా, గరిష్ఠంగా రూ. 10,000 మేర నష్టపోయి రూ. 2,34,600 ధరకు చేరుకుంది.

రిటైల్ మార్కెట్లలో ఇటీవల పెరిగిన ధరల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో ధరల్లో ఈ స్థాయిలో క్షీణత స్పష్టంగా కనిపించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరలు ఇప్పటికీ తగ్గినా భవిష్యత్ మార్కెట్ సంకేతాలు ఆశాజనకంగా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అక్టోబర్ ఫ్యూచర్స్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం పసిడి ధరలు త్వరలోనే మళ్లీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదు.
గత సెషన్లలో భారీ క్షీణత నమోదు చేసిన అనంతరం, బంగారం ధరలు క్రమంగా కోలుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 1.50 లక్షల రూపాయలకు పడిపోయిన తర్వాత కూడా క్రమంగా 1.65 లక్షలకు చేరిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా బంగారం రేట్లు క్రమంగా పెరుగుదల బాట పట్టొచ్చని చెబుతున్నారు. మంగళవారం నాటి ట్రేడింగ్ పాజిటివ్ గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తోన్నాయి.
పసిడి ధరలు తగ్గిన ప్రతిసారీ.. బై ఆన్ డిప్స్ ఫార్ములాను అనుసరిస్తోన్నారు కొనుగోలుదారులు. తగ్గినప్పుడు కొని పెట్టుకోవడం అనే సూత్రాన్ని పాటిస్తోన్నారు. మార్కెట్ చార్ట్‌లను గమనిస్తే.. మూవింగ్ యావరేజ్ జోన్ ఉన్న ప్రతీసారీ కొనుగోళ్లు ఊపందుకోవడం కనిపించింది. రానున్న పండుగల, పెళ్లిళ్ల సీజన్ వేళ దేశీయంగా ఈ ధరల ఒడిదొడుకులు ఇటు వ్యాపారులు, అటు కొనుగోలుదారులకు ఎంతో కీలకంగా మారాయి.













Click it and Unblock the Notifications
