సీన్ రివర్స్ అయిన బంగారం.. ఒక్కరోజులోనే రూ. 17,000 పతనం
పండగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరిపోయే శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు భారీగా పడిపోవడంతో దేశీయంగానూ పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఇటీవల వరుసగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠాలను తాకిన క్రమంలో, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ధంతేరాస్, దీపావళి పర్వదినం సందర్భంగా కొనుగోళ్లు జోరుగా సాగే ఈ సమయంలో ధరలు దిగిరావడం గిరాకీని మరింత పెంచుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి రేటు
వరుసగా రెండో రోజూ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 40 డాలర్లకు పైగా పడిపోయి 4249 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఈ ప్రభావం దేశీయంగానూ స్పష్టంగా కనిపించింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులంపై ఏకంగా రూ. 1,910 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 1,30,860 వద్దకు దిగివచ్చింది. ఇక నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 1,750 మేర తగ్గి, తులం ధర రూ. 1,19,950 వద్దకు చేరుకుంది. ధరలు మరింత దిగివస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తుండడం కొనుగోలుదారులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.
బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీ పతనమైంది. వరుసగా మూడో రోజు దిగొచ్చిన వెండి ధర, మొత్తంగా మూడు రోజుల్లో ఏకంగా రూ. 17,000 మేర తగ్గడం గమనార్హం. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుపై 3.84 శాతం పడిపోయి 51.91 డాలర్లకు చేరింది.
ఈ భారీ పతనంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,90,000 స్థాయికి దిగివచ్చింది. అయితే, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు రూ. 10,000 వరకు తక్కువకే లభిస్తుండడం వెండి కొనుగోలుదారులకు తీపి కబురు.
ధంతేరాస్ ముహూర్తం దగ్గర పడుతున్న వేళ, ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో జ్యువెలరీ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ ధరలు ఉదయం 7 గంటల సమయానికే సంబంధించినవి కాబట్టి, కొనుగోలు చేసే ముందు జీఎస్టీ వంటి పన్నులు, స్థానిక మార్పులను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.












Click it and Unblock the Notifications