HDFCలో రాజీనామా భూకంపం, విలువలు వర్సెస్ విధానాలు!
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక అనూహ్య సంక్షోభంలో చిక్కుకుంది. ఐదేళ్ల పాటు సంస్థను నడిపించిన పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతను చక్రవర్తి, మార్చి 19న తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇది కేవలం ఒక పదవి నుంచి తప్పుకోవడం కాదు.. బ్యాంక్ అనుసరిస్తున్న 'పద్ధతులపై' ఆయన సంధించిన నైతిక ప్రశ్న.
చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేల్చిన బాంబు ఇప్పుడు చర్చనీయాంశమైంది. "గత రెండేళ్లుగా బ్యాంక్‌లో నేను గమనించిన కొన్ని సంఘటనలు నా వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయి" అని ఆయన పేర్కొనడం కలకలం రేపింది. 2022లో జరిగిన భారీ విలీనం (HDFC Ltd & HDFC Bank) వల్ల ఆశించిన ప్రయోజనాలు ఇంకా పూర్తిగా సిద్ధించలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే, ఎక్కడా బ్యాంక్ తప్పు చేసిందని తాను అనడం లేదని, తన 'సిద్ధాంతాలు' సంస్థతో పొత్తు కుదరడం లేదని స్పష్టం చేయడం గమనార్హం.

రంగంలోకి ఆర్‌బీఐ.. దిద్దుబాటు చర్యలు!
ఈ రాజీనామా వెనుక ఉన్న నిగూఢ అర్థాలు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన బ్యాంక్ కావడంతో రిజర్వ్ బ్యాంక్ (RBI) వెంటనే రంగంలోకి దిగింది. చక్రవర్తి స్థానంలో సంస్థలోని అత్యంత అనుభవజ్ఞుడైన కెకి మిస్త్రీని మూడు నెలల పాటు తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఒక రకంగా వాటాదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నమే అయినా, అసలు గొడవ ఎక్కడ మొదలైందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.
విలీనం తెచ్చిన విబేధాలా?
1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా, మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా చక్రవర్తికి క్లీన్ ఇమేజ్ ఉంది. 40 బిలియన్ డాలర్ల భారీ విలీనం ద్వారా దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఎదిగే క్రమంలో.. బోర్డు నిర్ణయాలకు, ఆయన వ్యక్తిగత విలువలకు మధ్య ఎక్కడో ఘర్షణ జరిగినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మధ్య మరియు జూనియర్ స్థాయి ఉద్యోగుల శక్తిపై తనకు నమ్మకం ఉందని చెబుతూనే, పైస్థాయిలో జరుగుతున్న 'పద్ధతుల'పై ఆయన పెదవి విరవడం బ్యాంకింగ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రస్తుతానికి కెకి మిస్త్రీ సారథ్యంలో బ్యాంక్ ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ, ఒక సీనియర్ అధికారి "విలువలు" అనే కారణంతో తప్పుకోవడం హెచ్‌డీఎఫ్‌సీ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications