భారత్-ఈయూ ట్రేడ్ డీల్: పాకిస్థాన్ మిత్ర దేశానికి బిగ్ షాక్!
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాకిస్థాన్ మిత్రదేశమైన టర్కీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ భారీ ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈ ఒప్పందం వల్ల భారతీయ వస్తువులకు యూరోప్‌లో భారీ ఊరటనివ్వడమే కాకుండా.. దౌత్యపరంగా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపే టర్కీకి ఊహించని ఆర్థిక దెబ్బగా మారింది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం.. భారతీయ ఉత్పత్తులు యూరప్ మార్కెట్లోకి తక్కువ పన్నులతో లేదా పన్నులు లేకుండా ప్రవేశించవచ్చు. అయితే టర్కీకి మాత్రం ఈ ద్వారం మూసుకుపోయింది. టర్కీకి భారత్ తన మార్కెట్ తలుపులను రాయితీలతో తెరవకపోవడం గమనార్హం.
టర్కీకి రాయితీలు ఎందుకు దక్కవంటే?
యూరోపియన్ యూనియన్, టర్కీల మధ్య 1996 నుంచి 'కస్టమ్స్ యూనియన్' ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఈయూ ఏదైనా దేశంతో కొత్తగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే.. ఆ దేశం నుంచి వచ్చే వస్తువులకు టర్కీ కూడా పన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే భారతీయ వస్తువులు టర్కీ మార్కెట్లోకి తక్కువ పన్నుతో ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంలో భారత్ కేవలం ఈయూతోనే సంతకం చేసింది కానీ టర్కీతో కాదు. ఫలితంగా టర్కీ నుంచి భారత్‌కు వచ్చే వస్తువులపై పాత పద్ధతిలోనే భారీ టారిఫ్‌లు కొనసాగుతాయి. టర్కీ వస్తువులు యూరప్ ఓడరేవుల ద్వారా భారత్‌కు చేరుకున్నా.. అవి 'టర్కీకి చెందినవి'గానే పరిగణించబడతాయి కాబట్టి వాటికి ఎటువంటి 'డ్యూటీ-ఫ్రీ' సౌకర్యం లభించదు.

భారత్ ఎగుమతులకు లభించే బంపరాఫర్
ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల భారతీయ ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో తిరుగులేని ప్రాధాన్యత లభించనుంది. గణాంకాల ప్రకారం.. భారత్ నుంచి ఎగుమతి అయ్యే దాదాపు 96.8 శాతం వస్తువులకు యూరప్‌లో రాయితీలు లభిస్తాయి. ఎగుమతి పరిమాణం పరంగా చూస్తే 99.5 శాతం ఉత్పత్తులు ఎటువంటి పన్నులు లేకుండానే యూరోపియన్ యూనియన్ దేశాలకు చేరుకుంటాయి. దీనివల్ల భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా రంగానికి యూరప్‌లో డిమాండ్ భారీగా పెరగనుంది. ఇది చైనా వంటి దేశాల పోటీని తట్టుకుని భారత్ తన ఉనికిని చాటుకోవడానికి దోహదపడుతుంది.
భారత్, టర్కీల మధ్య క్షీణించిన దౌత్య సంబంధాలు
భారత్, టర్కీల ఇటీవలి కాలంలో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. ముఖ్యంగా గతేడాది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను టర్కీ బహిరంగంగా విమర్శించడం ఇండియా ఆగ్రహానికి కారణమైంది. ఈ ఉద్రిక్తతలు వాణిజ్య గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టర్కీకి భారత ఎగుమతులు 6.65 బిలియన్ డాలర్ల నుంచి 5.71 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అదే సమయంలో టర్కీ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులు కూడా సుమారు 21 శాతం మేర తగ్గాయి. పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచినందుకు టర్కీ ఇప్పుడు భారత్ లాంటి పెద్ద మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈయూతో జరిగిన ఈ కీలక ఒప్పందం భారత్‌కు వ్యూహాత్మక విజయం. టర్కీ తన వస్తువులను భారత్‌కు పంపాలనుకుంటే పాత పన్నులనే చెల్లించాల్సి ఉంటుంది, కానీ భారత వస్తువులు మాత్రం టర్కీకి చేరుకోవడానికి యూరప్ ఒప్పందం ఒక మార్గంగా మారుతుంది. ఇది టర్కీకి ఏకపక్ష నష్టాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తులో టర్కీ తన వైఖరిని మార్చుకుని భారత్‌తో విడిగా ఒప్పందం చేసుకుంటే తప్ప, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ దేశం బయటపడటం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications