ప్రయాణికులకు IndiGo షాక్! ఫ్లైట్లు రద్దు, ప్రయాణికుల్లో టెన్షన్
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చింది. సుదూర అంతర్జాతీయ విమానాల షెడ్యూల్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి 4, 2026 బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, బాహ్య కార్యాచరణ ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో వెల్లడించింది. ఈ మార్పులలో భాగంగా ఫిబ్రవరి 17 నుంచి డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
వైడ్-బాడీ విమానాల కార్యకలాపాలు ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఇండిగో స్పష్టం చేసింది. భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, తరచుగా మారుతున్న ఎయిర్‌స్పేస్ ఆంక్షలు, దేశీయంగా మరియు అంతర్జాతీయంగా విమానాశ్రయాల్లో పెరిగిన రద్దీ కారణంగా విమానాల ప్రయాణ సమయం, బ్లాక్ టైమ్ గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఆరు వైడ్-బాడీ విమానాలతో నడుస్తున్న 787-9 ఫ్లీట్ షెడ్యూల్‌పై ఇది తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని సంస్థ తెలిపింది.

ఈ నెట్‌వర్క్ సర్దుబాట్లలో భాగంగా, ఫిబ్రవరి 17 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు కోపెన్‌హాగన్‌కు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఢిల్లీ-మాంచెస్టర్ రూట్‌లో ప్రస్తుతం వారానికి ఐదు సార్లు నడుస్తున్న సేవలను ఫిబ్రవరి 7 నుంచి నాలుగు సార్లకు తగ్గించనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఈ మార్గంలో విమానాల సంఖ్యను మరింతగా తగ్గించి వారానికి మూడు సార్లు మాత్రమే నడపనున్నారు.
ఫిబ్రవరి 9 నుంచి..
ఇదే తరహాలో ఢిల్లీ-లండన్ హీత్రూ మార్గంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి ఈ రూట్‌లో విమానాల సంఖ్యను వారానికి ఐదు నుంచి నాలుగు సార్లకు తగ్గిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. వాస్తవానికి ఈ మార్పులను 2026 వేసవి షెడ్యూల్‌లో అమలు చేయాలని భావించామని, అయితే సుదూర విమానాల విశ్వసనీయతను కాపాడేందుకు ముందుగానే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రయాణికులకు మిస్‌కనెక్షన్లు, వరుస జాప్యాలు వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఇండిగో పేర్కొంది. తాత్కాలిక సర్దుబాట్ల ద్వారా సేవల నాణ్యతను మెరుగుపరచడమే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications