ఇంకాస్సేపట్లో స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్- లక్ష్మీపూజ
దీపావళి పండగను పురస్కరించుకుని దేశీయ స్టాక్ మార్కెట్ లో నేడు ముహూరత్ ట్రేడింగ్ ఉండబోతోంది. ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంప్రదాయ ట్రేడింగ్ ఇది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహణకు సంబంధించి సర్క్యులర్లను విడుదల చేశాయి. దీపావళి రోజున సాధారణ మార్కెట్ లావాదేవీలకు సెలవు ఉన్నప్పటికీ దీపావళి లక్ష్మీపూజను పురస్కరించుకుని గంట పాటు స్పెషల్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సాధారణ రోజుల్లో ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు ఈక్విటీ మార్కెట్ లావాదేవీలు కొనసాగుతాయి. ముహూరత్ ట్రేడింగ్ రోజున మాత్రం గంట పాటు మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ప్రధాన ట్రేడింగ్ విండో ఈ మధ్యాహ్నం 2:20 నిమిషాలకు ఆరంభం కానుంది. 3:30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పూజ రోజున స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఏడాది పొడవునా సంపద వృద్ధి చెందుతుందని ఇన్వెస్టర్లు బలంగా విశ్వసిస్తారు.

స్టాక్ ఎక్స్ఛేంజీల షెడ్యూల్ ప్రకారం.. ముహూరత్ ట్రేడింగ్ మధ్యాహ్నం 1:15 గంటలకు ఓపెన్ అవుతుంది. ట్రేడింగ్ సభ్యుల లాగిన్ విండోతో షురూ అవుతుందిది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:50 నుంచి 2:05 గంటల వరకు బ్లాక్ డీల్ విండోను అనుమతిస్తారు. మార్కెట్ ఆర్డర్లను బ్యాలెన్స్ చేయడానికి ప్రీఓపెనింగ్ సెషన్ 2:05కు ఓపెన్ అవుతుంది. 2:20 నిమిషాలకు కంటిన్యూయస్ ట్రేడింగ్ ప్రారంభమౌతుంది. 3:30 వరకు కొనసాగుతుంది.
ఈ ప్రత్యేక ట్రేడింగ్ వ్యవధిలో ఈక్విటీలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ వంటి అన్ని ప్రధాన విభాగాలలో లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పీరియాడిక్ కాల్ ఆక్షన్ సెషన్ మధ్యాహ్నం 2:25 నుంచి 3:20 నిమిషాల వరకు నడుస్తుంది. బ్రోకింగ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత పెట్టుబడిదారులు ఈ సమయంలో ట్రేడింగ్ చేయడానికి ఉత్సాహం చూపుతారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి రోజుతో నూతన విక్రమ్ సంవత్ సంవత్సరం ప్రారంభమవుతుంది. భారతీయ వ్యాపార దిగ్గజాలు ఈ రోజును కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే శుభదినంగా భావిస్తారు. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో ఎక్కువ శాతం మంది దీర్ఘకాలిక పెట్టుబడులకే మొగ్గు చూపుతారు. తమ పిల్లల పేరు మీద లేదా కుటుంబ సమృద్ధి కోసం క్వాలిటీ ఆధారిత బ్లూచిప్ స్టాక్స్‌ను కొనుగోలు చేసే సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఈ ట్రేడింగ్ సెషన్లో లావాదేవీల పరిమాణం సాధారణ రోజుల కంటే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పరంగా దీనికి అపారమైన ప్రాధాన్యత ఉంది. ఈ నూతన విక్రమనామ సంవత్సరంలో నష్టాలు రాకుండా, పెట్టుబడులు లాభసాటిగా సాగాలనే ఆకాంక్షతో ఇన్వెస్టర్లు ఈ ముహూరత్ ట్రేడింగ్ లో భాగస్వామ్యులవుతుంటారు.












Click it and Unblock the Notifications
