పసిడి వ్యామోహానికి బ్రేక్ వేయగలమా? ఫెయిలైన గోల్డ్ స్కీమ్..?
భారతీయులకు పసిడి అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం, సంపదకు చిహ్నం. కానీ, అదే పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, విదేశీ మారక ద్రవ్యంపై పడుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాబోయే ఏడాది కాలం పాటు ప్రజలెవరూ కొత్తగా బంగారం కొనకూడదని ఆయన కోరారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి పౌరులంతా ఈ 'బంగారు’ సంకల్పాన్ని స్వీకరించాలని ప్రధాని స్పష్టం చేశారు.
దేశంలో ముడి చమురు తర్వాత అత్యధికంగా దిగుమతి అవుతున్న వస్తువు బంగారమే. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పసిడి దిగుమతులు ఏకంగా 24 శాతం పెరిగాయి. దీని కోసం మన దేశం సుమారు $72 బిలియన్ల (రూ. 6 లక్షల కోట్లకు పైగా) విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఇంత భారీ స్థాయిలో సంపద విదేశాలకు తరలిపోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది.

నిరాశ పరిచిన గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (GMS)
గృహాల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఉత్పాదక రంగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'బంగారు నగదీకరణ పథకం’ (GMS) ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. భారతీయ గృహాల వద్ద సుమారు 34,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అయితే, నవంబర్ 2025 నాటికి ఈ పథకంలో కేవలం 39 టన్నులు (0.1 శాతం) మాత్రమే డిపాజిట్ అయ్యింది.
2017లో 6.5 టన్నుల నుంచి 2025 నాటికి 39 టన్నులకు చేరినప్పటికీ, కరోనా మహమ్మారి తర్వాత వృద్ధి మందగించింది. 2024లో డిపాజిట్ల వృద్ధి కేవలం 3.3 శాతానికే పరిమితమైంది. పథకం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మార్చి 2025లో ఈ పథకంలోని కొన్ని భాగాలను అధికారికంగా నిలిపివేశారు.
చిన్న మొత్తాలే దిక్కు.. మళ్ళీ ప్రారంభించాలన్న ఆభరణాల రంగం!
ఈ పథకంలో ఖాతాల సంఖ్య 718 నుంచి 6,531కి పెరిగినప్పటికీ, సగటున ఒక ఖాతాలో జమ చేస్తున్న బంగారం పరిమాణం 9.1 కిలోల (2017) నుంచి 5.5 కిలోలకు (2024) పడిపోయింది. అంటే పెద్ద పెట్టుబడిదారులు కాకుండా సామాన్యులు మాత్రమే చిన్న మొత్తాల్లో ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 19.2 టన్నులు దీర్ఘకాలిక డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి GMSను మళ్ళీ బలోపేతం చేయాలని రత్నాలు, ఆభరణాల రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
భారతీయుల పసిడి వ్యామోహం దిగుమతులపై భారాన్ని పెంచుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏడాది పాటు కొనుగోళ్లు నిలిపివేసి, ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉత్పాదక మార్గాల వైపు మళ్లించగలిగితేనే దేశ ఆర్థిక స్థిరత్వం సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.














Click it and Unblock the Notifications