UPI Credit Lines: అప్పులపై ఆర్బీఐ కొరడా.. కొత్త రూల్స్ ఇవే!
ఈరోజుల్లో జేబులో పర్స్ లేకపోయినా, బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో షాపింగ్ పూర్తి చేయవచ్చు. భారతీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవం తెచ్చిన 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (UPI) ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. కేవలం మన అకౌంట్లో ఉన్న డబ్బును వేరే వారికి పంపడమే కాకుండా, బ్యాంకులే మనకు అప్పటికప్పుడు అప్పు ఇచ్చే "యూపీఐ క్రెడిట్ లైన్" సదుపాయం విస్తరిస్తోంది. అయితే, ఈ డిజిటల్ రుణాల మంజూరుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ముందే ఆమోదించిన (Pre-approved) ఈ యూపీఐ క్రెడిట్ లైన్లు కూడా సాధారణ పర్సనల్ లోన్స్, రిటైల్ రుణాల పరిధిలోకే వస్తాయని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. 2026 జూన్ 23న జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. ఇకపై బ్యాంకులు ఈ డిజిటల్ అప్పుల నిర్వహణలో కూడా కఠినమైన పర్యవేక్షణ, రిస్క్ మేనేజ్మెంట్ - గవర్నెన్స్ నిబంధనలను యథాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల డిజిటల్ రుణాల రంగంలో మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులకు మరింత భద్రత చేకూరనుంది.

అసలు ఏంటి ఈ 'UPI క్రెడిట్ లైన్'? పర్సనల్ లోన్‌కు దీనికి తేడా ఏంటి?
చాలామంది యూపీఐ క్రెడిట్ లైన్‌ను సాధారణ పర్సనల్ లోన్ అనుకుంటారు. కానీ, దీని పనితీరు పూర్తిగా భిన్నం. పర్సనల్ లోన్ తీసుకుంటే మొత్తం డబ్బు ఒకేసారి మన అకౌంట్లో పడుతుంది. వాడుకున్నా, వాడుకోకపోయినా మొత్తానికి వడ్డీ కట్టాలి. క్రెడిట్ లైన్ విధానంలో బ్యాంకులు కస్టమర్ అర్హతను బట్టి ఒక నిర్దిష్ట పరిమితిని (ఉదాహరణకు రూ. 50,000) కేటాయిస్తాయి. మీరు ఆ లిమిట్ నుండి ఎంత డబ్బు అయితే వ్యాపారులకు (Merchants) చెల్లిస్తారో, కేవలం ఆ వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ లేదా ఇఎంఐ (EMI) నిబంధనలు వర్తిస్తాయి. కొన్ని బ్యాంకులు దీనిపై కొంతకాలం పాటు వడ్డీ లేని గడువును (Interest-free period) కూడా ఇస్తున్నాయి.
రుణం ఇచ్చే పద్ధతి మారినప్పటికీ, కస్టమర్ల అర్హతను అంచనా వేసే విధానం మాత్రం మారదని ఆర్థిక నిపుణుడు శెట్టి పేర్కొన్నారు. బ్యాంకులు కస్టమర్ ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం, పాత అప్పులు, క్రెడిట్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ సౌకర్యాన్ని కల్పిస్తాయి.
క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇది డిజిటల్‌గా చాలా ఈజీగా లభించే లోన్ అయినప్పటికీ, దీని ప్రభావం మీ సిబిల్ (CIBIL) లేదా క్రెడిట్ స్కోరుపై గట్టిగానే ఉంటుంది.
- సకాలంలో చెల్లిస్తే ప్లస్: ఇదొక అధికారిక రుణ సదుపాయం కాబట్టి, మీ లావాదేవీల వివరాలన్నీ క్రెడిట్ బ్యూరోలకు అందుతాయి. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోరు అద్భుతంగా పెరుగుతుంది.
- నిర్లక్ష్యం చేస్తే మైనస్: ఒకవేళ బిల్లులు కట్టడం ఆలస్యంచేసినా, లేదా ఇచ్చిన లిమిట్‌ను మితిమీరి వాడేసినా క్రెడిట్ స్కోరు దారుణంగా పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రెడిట్ కార్డుల పని అయిపోయినట్లేనా?
యూపీఐ క్రెడిట్ లైన్లు వచ్చాక ఇక క్రెడిట్ కార్డులతో పనేముంది అని చాలామంది భావిస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయం కాదు, కేవలం ఒక అదనపు సదుపాయం మాత్రమే. క్రెడిట్ కార్డులు ఇచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ప్రపంచవ్యాప్తంగా లభించే విస్తృత ఆమోదం వంటి లగ్జరీ ప్రయోజనాలు యూపీఐ క్రెడిట్ లైన్‌కు ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న కొనుగోళ్లకు, అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బుల్లేనప్పుడు ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
సులభంగా డిజిటల్ అప్పు దొరుకుతోంది కదా అని అనవసరపు ఖర్చులు చేయడం అస్సలు మంచిది కాదు. మన నెలవారీ ఆదాయం, తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని మనసులో ఉంచుకుని క్రమశిక్షణతో వాడుకుంటేనే 'యూపీఐ క్రెడిట్ లైన్' మన ఆర్థిక భవిష్యత్తుకు ఒక వరంలా మారుతుంది.














Click it and Unblock the Notifications