ట్రంప్ దెబ్బ.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు గోవిందా!
Stock Market Crash: భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాలు, ట్రేడ్ వార్ భయాల మధ్య దలాల్ స్ట్రీట్ అతలాకుతలం అయింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే కరిగిపోయింది.
రూ.10.12 లక్షల కోట్ల సంపద ఆవిరి!
మార్కెట్ పతనం తీవ్రత ఎంతలా ఉందంటే.. బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ. 465.68 లక్షల కోట్లుగా ఉండగా, మంగళవారం అది రూ. 455.72 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే ఇన్వెస్టర్లు రూ. 10.12 లక్షల కోట్లను నష్టపోయారు.

టాప్-30లో ఒకే ఒక్కడు.. మిగతావన్నీ బద్ధలు
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని టాప్-30 షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా మిగిలిన 29 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. అత్యధికంగా జొమాటో షేర్లు 4 శాతానికి పైగా పడిపోయాయి. వీటితో పాటు బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇండిగో, రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజ షేర్లు కూడా కుప్పకూలాయి. ఐటీ రంగంలో విప్రో 3 శాతం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 6 శాతం వరకు నష్టపోయాయి.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్‌కు చెందిన 8 దేశాలపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. గ్రీన్‌లాండ్‌పై పట్టు కోసం ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందనే భయం నెలకొంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా పదో రోజూ తమ అమ్మకాలను కొనసాగించారు. సోమవారం ఒక్కరోజే వీరు రూ. 3,263 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మార్కెట్ అస్థిరంగా ఉండటంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 4,700 డాలర్ల (పర్ ఔన్స్) మార్కును దాటింది. వెండి కూడా రికార్డు గరిష్టాలకు చేరుకుంది.
ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications