తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలనం నిర్ణయం- కుమారుడు ఉదయనిధి పట్టం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు పట్టం కట్టనున్నారు. డీఎంకే యువజన విభాగానికి సారథ్యాన్ని వహిస్తోన్న ఉదయనిధి స్టాలిన్- ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి రాజ్‌భవన్ దర్బార్ హాలులో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

159 స్థానాల్లో..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకే సారథ్యంలోని సంకీర్ణ కూటమి 159 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించింది. అప్పటివరకు అధికారంలో కొనసాగిన అన్నాడీఎంకే-బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తు చేసింది. మే 7వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు.

అప్పట్లో నో ఛాన్స్..
అప్పట్లో ఉదయనిధి మారన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువ నాయకుడు కావడం వల్ల అనుభవం రావాలనే ఉద్దేశంతో కేబినెట్‌కు దూరం పెట్టారు స్టాలిన్. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతోన్నారు. ఈ నెల 14వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారాయన. ఈ సారి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు అవకాశం ఇచ్చారు.

ఎల్లుండే ప్రమాణం..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్.. చెపాక్-తిరువళ్లికేణి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇదివరకే గవర్నర్ ఆర్ ఎన్ రవికి ప్రతిపాదనలను పంపించారు. వాటిపై తాజాగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని రాజ్‌భవన్ తెలిపింది. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు.

పోర్ట్‌ఫోలియో ఇదే..
ఉదయనిధి స్టాలిన్‌కు యువజన సర్వీసుల వ్యవహారాలు, క్రీడలు, స్పెషల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తమిళనాడు మీడియా అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ పోర్ట్‌ఫోలియో శివ వీ మేయ్యనాథన్ ఆధీనంలో ఉన్నాయి. స్పెషల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖను నేరుగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తోన్నారు.

సినిమాతో ఎంట్రీ..
చిత్ర నిర్మాత, పంపిణీదారుగా తన కేరీర్‌ను ప్రారంభించిన ఉదయనిధి స్టాలిన్.. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. డీఎంకే యువజన విభాగాధిపతిగా వ్యవహరిస్తోన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి, విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే అభ్యర్థుల కోసం విస్తృతంగా పర్యటించారు. బహిరంగ సభలు, రోడ్‌షోలను నిర్వహించారు. డీఎంకే స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకడిగా మారారు.

మేయర్‌గా అనుకున్నా..
తన తండ్రి స్టాలిన్ తరహాలో చెన్నై సిటీ మేయర్‌గా రాజకీయాల్లోకి అడుగు పెడతారని భావించినప్పటికీ- ఏకంగా అసెంబ్లీలోనే అడుగు పెట్టారు. తాత, మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మూడుసార్లు గెలుపొందిన చెపాక్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సహకార మంత్రి పెరియసామిని గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగిస్తారని, కేఆర్ పెరియకరుప్పన్ చేతికి గ్రామీణాభివృద్ధి శాఖకు బదలి చేస్తారని చెబుతున్నారు. కే రామచంద్రన్‌ను అటవీ శాఖ నుంచి తప్పించి, పర్యాటక శాఖకు మారుస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications