'తమిళనాడు' పేరుపై రాజుకున్న వివాదం
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య వివాదం ముదిరింది. తమిళనాడుకు 'తమిళగం' పేరు సరిపోతుందని గవర్నర్ ఇటీవల వ్యాఖ్యానించారు. కొంత కాలంగా 'తమిళగం' అనే పదం ద్రవిడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ పదం వాడకంపై తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ పై మండిపడుతున్నారు.
తమిళనాడు అంటే 'తమిళ భూమి' అని తమిళ భాషలో అర్థం వస్తుంది. అదే తమిళగం అంటే 'తమిళుల నివాసం'అని అర్థం. తమిళ జాతీయవాద కోణంలో తమిళనాడు దేశాన్ని సూచిస్తోందని, ఈ క్రమంలోనే తమిళనాడు అనేది భారత్ లో అంతర్భాగం కాదని, దేశంలో స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని సూచిస్తోందనే వాదనలున్నాయి. అయితే డీఎంకే దీన్ని కొట్టేస్తోంది. 'తమిళనాడు' అనే పేరు.. తమ భాష, సంప్రదాయం, రాజకీయాలు, జీవితాన్ని సూచిస్తుందని, ఈ నేల ఎప్పటికీ తమిళనాడుగానే ఉంటుందని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు.

డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' సైతం ఇటీవల గవర్నర్‌పై ధ్వజమెత్తింది. తమిళనాడు అనేది ఒక సార్వభౌమ దేశాన్ని సూచిస్తుందని గవర్నర్ అన్నారని, అయితే.. రాజస్థాన్ పేరు మీకు ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ లా అనిపిస్తోందా? అని ప్రశ్నించింది. మహారాష్ట్ర అనే పేరు 'మరాఠాల భూమి' అని సూచించడం లేదా? కేరళ పర్యాటక నినాదం.. 'దేవుడి సొంత దేశం' అని ఉంటుందని, ఇది సమస్యాత్మకంగా కనిపించడం లేదా..?' అని పలు ప్రశ్నలు సంధించింది. తమిళగం అనే పేరును పెరియార్ ఈవీ రామస్వామి మొదటిసారిగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మద్రాస్ రాష్ట్రానికి పేరు మార్చే సమయంలో కూడా 'తమిళనాడు' పేరుకు సంబంధించి చర్చ జరిగింది. అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం 1967 జులై 18వ తేదీన మద్రాస్ రాష్ట్రానికి 'తమిళనాడు' గా పేరు మార్చాలని తీర్మానం చేసింది. భారత్ లో 'తమిళనాడు' అనేది అంతర్భాగమైన రాష్ట్రమని, పేరు కారణంగా ఇది స్వతంత్ర దేశం కాజాలదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications