అమర్‌నాథ్ యాత్ర నయం.. తిరుమలలో దర్శనంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న సర్వ దర్శనం టోకెన్ల సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తిరుమలలో పరిస్థితులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. భక్తుల మధ్య తోపులాట బాధాకరం అని అభిప్రాయపడ్డారు. టీటీడీ పాలకమండలి తీరుపై మండిపడ్డారు.
మండుటెండలో చలువ పందిళ్లు కూడా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో 1500 రూములను మూసివేశారని పయ్యావుల ఆరోపించారు. తిరుమల కింద ఉన్న హోటళ్లతో వ్యాపారాలు జరగాలి అనేలా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. వేసవిలో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా.. పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. తిరుమలను వదిలేసి సీఎం రాక కోసం ఒంటిమిట్టలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలకు వెళ్లి రావాలంటే అమర్‌నాథ్ యాత్ర వెళ్లి వచ్చినట్టు ఉందని మండిపడ్డారు.

తిరుమలలో భక్తులకు చలువ పందిళ్ళు కూడా ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా తిరుమల పవిత్రత కోసం అంతా పోరాడాల్సిన పరిస్థితి వస్తుందని.. కొండ మీద పరిస్థితి చూసి ఇతర ప్రాంతాల భక్తులు దర్శనానికి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. టీటీడీ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని.. భక్తులు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి తీసుకురావాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో టికెట్ల కోసం భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. మంగళవారం సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు ఎగబడ్డారు. దీంతో తిరుమలలో తోపులాట జరిగింది. పలువురు భక్తులు గాయపడ్డారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించడం సాధ్యపడలేదు. గాయపడిన వారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. దీనిపై పయ్యావుల కేశవ్ స్పందించారు. టీటీడీ తీరు సరిగా లేదని విమర్శించారు.