జగన్ ప్రధాని కావాలి: చంద్రబాబు గెలుపుపై పెద్దిరెడ్డి డౌట్స్..రాజీనామా: కుప్పంలో వర్షాలకు లింక్
చిత్తూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓట్లను సాధించగలిగామని ఉప ముఖ్యమంత్రి కళత్తూర్ నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ఆదివారం జరగబోయే చివరి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఇవే తరహా ఫలితాలు వెలువడుతాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పతనానికి ఈ ఎన్నికలు నాంది పలికాయని స్పష్టం చేశారు. తమది అందరి ప్రభుత్వమని, అందుకే అన్ని ప్రాంతాల వారు ఆదరించారని వారు పేర్కొన్నారు.
భారత్-పాక్ వార్: సాయంత్రం తిరుపతికి వైఎస్ జగన్: దక్షిణాదిన తొలిసారిగా: ఏపీతో ఆరంభం

జగన్ ఆశయాన్ని సాధించాం..
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని, దాన్ని తాము సాధించామని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పం సహా చిత్తూరు జిల్లా అభివృద్ధి విషయంలో ఏది అడిగినా ముఖ్యమంత్రి కాదనకుండా మంజూరు చేశారని చెప్పారు. కుప్పంలో తమ పార్టీకి ఓట్లు పడవనే విషయం తెలిసినప్పటికీ.. ప్రతి ఒక్కరి మేలును కోరి జగన్ పనిచేశారని, సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందజేశారని చెప్పారు. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో పథకాలు అందాయని అన్నారు.

ఆ 14 చోట్ల కూడా..
తాము మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు 14 పంచాయతీల్లోనూ అతి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలమైన పంచాయతీలను తాము గెలుచుకున్నామని చెప్పారు. ఇన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి ఎలా గెలుస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. ఆయన ఓ అసమర్థ నాయకుడిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే సర్పంచ్‌లను గెలుచుకోలేకపోయారని చురకలు అంటించారు. దీనికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

చంద్రబాబు రాజీనామా చేస్తారా?
కుప్పంలో అక్రమాలకు పాల్పడుతూ విజయం సాధిస్తున్నారంటూ ఇదివరకు ఆరోపణలు వచ్చాయని, అవి ఇప్పుడు నిజమని నిరూపించినట్టయిందని అన్నారు. తన ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా? లేదా? అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయని, కుప్పంలో మాత్రం ఆ పరిస్థితి లేదని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. రెండు మండలాల్లో వర్షమే కురవలేదని, ఇక పరిస్థితి ఉండదని అన్నారు. చంద్రబాబుకు భవిష్యత్‌లో పిచ్చిపట్టడం ఖాయమని చెప్పారు.

జగన్ ప్రధాని కావాలి..
ముఖ్యమంత్రిగా పార్టీలకు అతీతంగా ప్రజల మనస్సులను గెలుచుకున్న వైఎస్ జగన్.. ప్రధానమంత్రి కావాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నారాయణస్వామి అన్నారు. దీనికోసం తాము శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. మన రాష్ట్రం సాధించిన ప్రగతిని, దేశం మొత్తానికీ విస్తరింపజేయడానికి వైఎస్ జగన్.. ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో తిరిగి.. తమ మద్దతుదారుల ఫొటోలు, వివరాలను తెలియజేస్తామని చెప్పారు. గ్రామాల్లో జగన్ నామస్మరణ తప్ప మరొకటి ఉండట్లేదని అన్నారు.