మంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్‌కు ఎస్ఈసీ
చిత్తూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చిత్తూరు జిల్లాలో పర్యటించబోతోన్నారు. కాస్సేపట్లో ఆయన పర్యటన ప్రారంభం కాబోతోంది. తన పర్యటన సందర్భంగా జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారులతో భేటీ అవుతారు. జిల్లాలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి సమీక్షించనున్నారు. ఇప్పటికే ఒక విడత జిల్లాల పర్యటనను ఆయన ముగించుకున్నారు.
నిమ్మగడ్డ ఆదేశాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఈ ఐఎఎస్‌పై చర్యలకు: ఎస్ఈసీకి రిప్లయ్

చిత్తూరు జిల్లాకు నిమ్మగడ్డ
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో నిమ్మగడ్డ పర్యటిస్తుండటం వల్ల అందరి దృష్టికి అటు వైపు మళ్లింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేసుకున్నట్లుగా భావిస్తోన్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత జిల్లా కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారు? ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.

రాజకీయ కోణంతో చూస్తోన్న వైసీపీ
ఇప్పటికే అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. నిమ్మగడ్డ పర్యటనలను రాజకీయ కోణంతో చూస్తున్నారనేది తెలిసిన విషయమే. టీడీపీ నాయకుడిగా ఆయన పర్యటిస్తున్నారంటూ పలువురు నాయకులు విమర్శలను గుప్పించారు. కడప జిల్లా పర్యటన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లాలో పర్యటించడం తనకు సంతోషంగా ఉందని, వైఎస్సార్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు ప్రస్తావన తెస్తారా?
రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న నేతగా నిమ్మగడ్డ వైఎస్సార్‌ను అభివర్ణించారు. చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలో పర్యటిస్తున్నందున.. ఈ సారి ఆయన గురించి మాట్లాడతారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటికే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాకు వెళ్లి.. వైఎస్సార్ గురించి చెప్పుకొచ్చిన నిమ్మగడ్డ ఈ సారి చిత్తూరులో చంద్రబాబు ఘనతను కూడా వివరించాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ఆగడాల గురించి..
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు దగ్గర తాను పనిచేశానని నిమ్మగడ్డ చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న దౌర్జన్యాల, ఆ పార్టీ కార్యకర్తల ఆగడాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందంటూ సూచించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నిమ్మగడ్డ చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతోన్నారు. పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా? లేదా? అనేది తేలుతుందని చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు..