టీడీపీ ముందస్తు జాగ్రత్త- మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
చిత్తూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారంటూ చెబుతున్నారు.
నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, ఆరు నెలలుగా ముందుగానే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడానికి కారణం కూడా అదేనని అంచనాలు ఉన్నాయి.

తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు వేగం పెంచారు. మొన్నటికి మొన్న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని ప్రకటించారాయన. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ వ్యవహారం- మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ రావు కుటుంబంలో కలకలం రేపినప్పటికీ పట్టించుకోవట్లేదు.
తాజాగా తన సొంత జిల్లా చిత్తూరులో కీలక నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయిన గంగాధర నెల్లూరుకు పార్టీ ఇన్‌ఛార్జ్‌ను నియమించారు. డాక్టర్ వీఎం థామస్‌ను పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా అపాయింట్ చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీఎం థామస్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు చెప్పారు.
ఇది- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి సొంత నియోజకవర్గం. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014లో అప్పటి టీడీపీ అభ్యర్థిని గుమ్మడి కుతూహలమ్మపై 20 వేలకు పైగా మెజారిటీ విజయదుందుభి మోగించారు. 2019లో ఈ మెజారిటీ రెట్టింపయింది. టీడీపీ తరఫున పోటీ చేసిన అనగంటి హరికృష్ణపై 45 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
అనగంటి హరికృష్ణకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు. ఆయనకు బదులుగా డాక్టర్ వీఎం థామస్‌ను బరిలోకి దించారు. థామస్ స్వస్థలం కార్వేటి నగరం. చెన్నైలో డాక్టర్‌గా పని చేస్తోన్నారు. ఛెస్ట్ స్పెషలిస్ట్. చాలాకాలంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తోన్నారు. ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications