వైసీపీలో కాక రేపుతున్న రోజా: పార్టీ పేరు అవుట్-అరవ రాజకీయం?
Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా వ్యవహారం కలకలం రేపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆమె దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుగ్గా ఉండట్లేదు.
ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తోన్నారు రోజా. తమిళనాట ఉండే ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తోన్నారామె. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కావడిని సమర్పించారు. అంతకుముందు తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామివారినీ దర్శించారు. ఇదివరకు ఫ్యామిలీ ట్రిప్‌గా ఇంగ్లాండ్ వెళ్లొచ్చారు.

ఇలా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఇది కాస్తా- వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమౌతోంది. ఆమె ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలకూ తెర తీసినట్టయింది. దీనిపై రోజుకో చర్చ నడుస్తోంది.
జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెద్దగా పొసగకపోవడం, సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తోన్నారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు చెప్పుకోవడం.. వంటి పరిణామాలు ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి.
అదే సమయంలో- రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తించింది. నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటకం- యువజన సర్వీసుల మాజీ మంత్రిగా తన బయోడేటాలో పొందుపరిచారు. పార్టీ గురించి ఎక్కడా రాయలేదు. అకౌంట్ హెడ్డర్‌లో కూడా వైఎస్ జగన్ ఫొటోను తొలగించారు.
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం రోజా కొనసాగడంపై మరోసారి అనుమానాలను లేవనెత్తినట్టయింది. తమిళనాడు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తోన్నాయి. దళపతి విజయ్ కొత్తగా ప్రకటించిన తమిళగ వెట్రి కజగంలో చేరొచ్చనీ అంటున్నారు.












Click it and Unblock the Notifications