YS Jagan birth day: సంచలన నిర్ణయాన్ని తీసుకున్న రోజా: ఏకంగా గ్రామాన్నే..
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు ఆర్ కే రోజా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని సమాజం మెచ్చే మంచి పనులు చేస్తానంటూ ఇదివరకే ఆమె ప్రకటించారు. ఓ మంచి మనిషి జన్మదినం నాడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ దఫా వైఎస్ జగన్ పుట్టిన రోజు నాడు అలాంటి కార్యక్రమానికి పూనుకున్నారు.

పేద విద్యార్థినికి ఉన్నత విద్య..
గత ఏడాది వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు పుష్పకుమారి అనే పేద విద్యార్థినిని రోజా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అద్భుత ప్రతిభను చూపారు. కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయికి తీసిపోని విధంగా నీట్‌లో 89 శాతం మార్కులను సాధించారు. రోజా కలలను నెరవేర్చారు. అన్నీ తానై తనను చదివించిన రోజాకు గర్వించేలా చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పుష్పకుమారి తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో ఆమె చదువుకున్నారు.

నీట్‌లో గ్రేట్..
మెడిసిన్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ విద్యార్థినిని వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు దత్తత తీసుకున్నారు. ఎంబీబీఎస్ చదివించడానికి అవసరమైన ఖర్చను భరించారు. ప్రతి పేద విద్యార్థి అత్యున్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధన, నాడు-నేడు వంటి పథకాలను అమలు చేస్తోన్న వైఎస్ జగన్ వంటి మంచి మనిషి జన్మదినాన పుష్పకుమారిని దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. రోజా శ్రమ వృధా కాలేదు. నీట్‌లో 89 శాతం మార్కులను సాధించారు.

ఈ పుట్టినరోజు నాడు..
ఈ పుట్టినరోజు నాడు కూడా రోజా మరో సామాజిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దఫా ఆమె ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం పేరు మీరాసాహెబ్ పాలెం. నగరి నియోజకవర్గంలోని మారుమూల పల్లె ఇది. ఇక్కడ ముస్లింల జనాభా అధికం. చదువుకున్న వారి చాలా తక్కువ. సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. తమిళనాడు సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామాన్ని రోజా దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని, మౌలిక సదుపాయాలను కల్పిస్తానని చెప్పారు.

వచ్చే బర్త్‌డే నాటికి..
ఈ గ్రామాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని రోజా చెప్పారు. వైఎస్ జగన్ వచ్చే పుట్టిన రోజు నాటికి మీరాసాహెబ్ పాలెంను అభివృద్ధి చేసి, ఆయనకు కానుకగా ఇస్తానని చెప్పారు. మనకు ఇష్టమైన వారి పుట్టినరోజు నాడు బొకేలను ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని, అవి పాడైపోతాయని, చిరస్మరణీయమైన బహుమతి ఇవ్వడమే నిజమైన కానుక అని రోజా అన్నారు. ఒక కుటుంబానికో.. ఒక ఊరికో మేలు చేసేలా నిర్ణయాలను తీసుకుని, దాన్ని కార్యాచరణలోకి తీసుకుని రావడమే గొప్ప కానుక అని చెప్పారు. తాను మీరాసాహెబ్ పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని పేర్కొన్నారు.