నేడే హనుమాన్ జయంతి- ఇలా చేయండి
దేశంలో హనుమాన్ జయంతిని హిందూ క్యాలెండర్ ప్రకారం వివిధ సమయాల్లో, ఒక్కో ప్రాంతంలో తమకంటూ ప్రత్యేకమైన సంప్రదాయాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చైత్ర పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ ఉత్తరాది ప్రసిద్ధి చెందినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతికి విశేష ప్రాధాన్యత ఉంది. నేడు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఈ హనుమాన్ జయంతి జరగనుంది.
తమిళనాడులో మార్గశిర అమావాస్య నాడు హనుమత్ జయంతిగా దీన్ని నిర్వహిస్తారు. కర్ణాటకలో మార్గశిర మాసంలో శుక్ల పక్ష త్రయోదశి నాడు, ఒడిశాలో విశ్వ సంక్రాంతి లేదా మేష సంక్రాంతి రోజున హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష దశమి తిథి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని ఆచరిస్తారు. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష దశమి తిథి మే 11న మధ్యాహ్నం 3:24 నిమిషాలకు మొదలైంది. ఈ మధ్యాహ్నం 2:52 నిమిషాలకు సమాప్తమవుతుంది. ఈ శుభ సమయంలో చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.
తెలుగు హనుమాన్ జయంతి ప్రత్యేకమైన అంశాలలో ఒకటి.. 41 రోజుల దీక్ష. 41 రోజుల పాటు భక్తులు ఈ కఠిన వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ దీక్షా స్వీకరణ ఏప్రిల్ 2న మొదలైంది. నేటితో ముగుస్తుంది. దీక్షాకాలంలో భక్తులు కఠినమైన నియమాలను ఆచరిస్తారు. ఆ సంజీవరాయుడికి పూజాదికాలను నిర్వహిస్తారు. చివరి రోజున ప్రత్యేక పూజలతో దీక్షను విరమిస్తారు. రామాయణం ప్రకారం వీరాంజనేయుడు అంజనాద్రి కొండపై జన్మించాడని ప్రగాఢంగా నమ్ముతారు.
వానర రాజు కేసరి సతిమణి మాత అంజన, ఇక్కడ తీవ్ర తపస్సు చేయగా మారుతి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో, హనుమంతుడిని భక్తి, అపారమైన బలం, ధైర్యం, ఆత్మనియంత్రణ, నిస్వార్థ సేవకు ప్రతీకగా పూజిస్తారు. ఆయన ఆదర్శ ప్రాయమైన విలువలను భక్తులు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆంజనేయుడు వివిధ ప్రాంతాలలో అనేక పేర్లతో పిలువబడతారు. అంజనాద్రిలో మారుతి అని, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలలో హనుమంత, ఆంజనేయ అని సంబోధిస్తారు. తెలుగు ప్రాంతాలలో హనుమంతుడు, ఆంజనేయుడుగా పూజలందుకుంటాడు.
పండుగ రోజు తెల్లవారుజామున స్నానం ఆచరించిన తర్వాత, ఉపవాసం, నిష్టతో పూజ చేయడానికి సంకల్పం తీసుకుంటారు. భక్తులు హనుమాన్ చాలీసా, సుందరకాండలను పఠిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. సింధూరం, తమలపాకులు, బెల్లం కలిపిన వేయించిన శెనగలు వంటి శుభకరమైన నైవేద్యాలను ఆంజనేయుడికి సమర్పిస్తారు. హనుమాన్ జయంతి రోజున దేవాలయాలు భజనలు, కీర్తనలు, వైభవంగా సాగే ఊరేగింపులతో కళకళలాడుతాయి.
హనుమంతుడి ఆరాధనలో కొన్ని సాంప్రదాయ నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. సాధారణంగా దేవతా పూజలలో ఉపయోగించే చరణామృతం హనుమాన్ పూజలో వాడరు. కాబట్టి భక్తులు దీనిని సమర్పించకపోవడం మంచిది. ఉపవాసం పాటించేవారు ఈ పవిత్రమైన రోజున ఉప్పును తినకూడదని సలహా ఇస్తారు. హనుమంతుడు నిరంతర బ్రహ్మచారి కాబట్టి, పూజ సమయంలో మహిళలు ఆయన విగ్రహాన్ని తాకకుండా ఉండాలని ఒక నమ్మకం ప్రాచీన కాలం నుండి ఉంది.
తిరుమలలో..
తిరుమలలో నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి, జాపాలి తీర్థంలో గల హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనుంది టీటీడీ. సాంప్రదాయబద్ధంగా టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.












Click it and Unblock the Notifications