ఒక్క శాప ఫలితం- మూడు తరాల యుద్ధాలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి. రోజుల తరబడి సాగుతోందీ వార్. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ.. దీనికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటి మాదిరిగానే పురాణాల్లో ఎన్నో పోరాటాలు జరిగాయి. అవి రాజ్యాల మధ్య కాకుండా దేవతలు, రాక్షసుల మధ్య సంభవించాయని మనం చదువుకున్నాం. మహాభారతం, రామాయణం లంకా దహనం వంటివి వీటికి ఉదాహరణలు.
స్వర్గ ద్వారపాలకుల అపార్థం వల్ల ఒక యుద్ధం జరిగి, విశ్వ రక్షణకు విష్ణువు పలు అవతారాలు దాల్చిన వైనం మీకు తెలుసా?. ఒక శాప ఫలితంగా మూడు యుగ్గాల్లో మూడు యుద్ధాలు జరిగాయి. హిందూ పురాణాల ప్రకారం సనక, సనందన, సనాతన, సనత్ కుమార అనే నలుగురు ప్రసిద్ధులు. వీరిని సనక కుమారులుగా పురాణాలు ప్రస్తుతించాయి. బ్రహ్మదేవుడు వారిని ఆధ్యాత్మిక చేతనతో సృష్టించాడు. లౌకిక జీవితాన్ని త్యజించి, పరమ సత్యం, జ్ఞానం కోసం అన్వేషించారు. ఈ నలుగురూ.. బ్రహ్మదేవుడి మానసపుత్రులు.

చిన్నారుల్లా కనిపించినా, అపారమైన జ్ఞానం, వేదోపనిషత్తులపై మంచి పట్టు సాధించారు.. చిన్న వయస్సులోనే. అపార జ్ఞానాన్ని సముపార్జించారు. ముల్లోకాలు పర్యటించారు. మహర్షుల నుండి జ్ఞానం పొంది, చివరికి విష్ణు నివాసమైన వైకుంఠానికి చేరారు. విష్ణు దర్శనం, ఆయన ఆశీస్సులు పొందడమే వారి ముఖ్య ఉద్దేశ్యం. ఈ నలుగురు కుమారులు వైకుంఠ ప్రధాన ద్వారం వద్దకు రాగా, విష్ణువు రక్షకులైన జయ, విజయులు వారిని అడ్డుకున్నారు. చిన్నారుల్లా ఉండటంతో వారిని పిల్లలుగా భావించి, “విష్ణువు అనుమతి లేకుండా పవిత్ర స్థలాన్ని ప్రవేశించలేరు” హూంకరించారు.
ఆ నలుగురు కూడా తమని తాము పరిచయం చేసుకోవాలని ప్రయత్నించారు గానీ అది సాధ్యపడలేదు. ద్వారపాలకుల జయ- విజయులను ఒప్పించలేకపోయారు. ఇది అపార్థానికి దారి తీసింది. ఈ అపార్థం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి, విశ్వ క్రమంలో ముఖ్యమైన మార్పునకు తొలి అడుగు వేసింది. నిర్లక్ష్యం, అవమానంతో ఆగ్రహించిన సనక కుమారులు జయ, విజయులను "మీరు రాక్షసులుగా మారెదరుగాక.." అని శపించారు.
దీంతో దిగ్భ్రాంతి చెందిన ద్వారపాలకులకు వెంటనే తప్పు తెలిసివచ్చింది. ఈ విషయం విష్ణువుకు తెలియగానే, ఆయన సనక కుమారుల ముందు ప్రత్యక్షం అయ్యారు. శాపాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీనికి సనక కుమారులు నిరాకరించి, శాపాన్ని వెనక్కి తీసుకోలేమని, దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని చెప్పారు. జయ, విజయులకు భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తిని కల్పించారు.
శాపాన్ని తప్పించలేమని, వ్యవధిని మాత్రం మార్చవచ్చని విష్ణువు వివరించారు. ప్రభావాన్ని తగ్గించేందుకు కుమారులు జయ, విజయులకు రెండు దారులు చూపారు. ఒకటి.. ఏడు జన్మలు విష్ణువుకు దూరంగా, భూమిపై భక్తులుగా జీవించడం.
రెండోది: ఆయన శత్రువులుగా కేవలం మూడు జన్మలు గడపడం. ఏడు జన్మలు భగవంతుడికి దూరంగా ఉండటం భరించరానిది కావడంతో జయ, విజయులు రెండో ఎంపిక చేసుకున్నారు. శత్రువులైనా విష్ణువుతోనే ఉండాలని కోరుకున్నారు.
వారి మూడు జన్మలు హిందూ పురాణాలలో గొప్ప కథలయ్యాయి. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా జన్మించారు. విష్ణువు వరాహ, నరసింహ అవతారాలతో అంతం అయ్యారు. రెండో జన్మలో రావణుడు, కుంభకర్ణుడిగా వచ్చి, రాముని చేతిలో మరణం పొందారు. చివరి జన్మలో శిశుపాలుడు, దంతవక్త్రుడిగా శ్రీకృష్ణుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రతి జన్మలోనూ దైవ జోక్యం అవసరమయ్యే బలమైన సంఘర్షణలు జరిగాయి.












Click it and Unblock the Notifications