Amaravati: రైతు చేతిపైకి పోలీసు జీప్: మందడంలో మహిళల అరెస్టు.. ఉద్రిక్తత!
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన శుక్రవారం నాటికి మరింత ఉధృతమైంది. రైతులు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఫలితంగా- రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు బంద్ పాటిస్తున్నారు. దుకాణాలను మూసివేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.
సకల జనుల సమ్మెను భగ్నం చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మందడంలో 17 రోజులుగా మహిళలు వివిధ రూపాల్లో నిరసనలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని, వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించారు. ఫలితంగా- తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ ఘర్షణలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లిపోయారు. కొంతమందికి గాయాలు అయ్యాయి. దీనితో మహిళలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోం శాఖ మంత్రి సుచరితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానులు వద్దు..అమరావతి ఒక్కటే రాజధానిగా ముద్దు అంటూ నినదించారు. మహిళలను తరలించడానికి వినియోగించిన వాహనానికి స్థానిక రైతు ఒకరు అడ్డుగా పడుకున్నారు.
Amaravati: రైతు చేతిపైకి పోలీసు జీప్: మందడంలో మహిళల అరెస్టు.. ఉద్రిక్తత!#AndhraPradesh #Mandadam #Amaravati #AP #Police #Farmers pic.twitter.com/mRmit9qP8n
— Oneindia Telugu (@oneindiatelugu) January 3, 2020
ఈ సందర్భంగా ఆయన చేతిపైకి వాహనం వెళ్లింది. అనంతరం గ్రామస్తులు అందరూ ఆ రైతుకు మద్దతుగా రోడ్డు మీద పడుకున్నారు. పలువురు రైతులు, స్థానికులు పోలీసు వ్యాన్ కు అడ్డుగా పడుకున్నారు. వారిని అక్కడి నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పదుల సంఖ్యలో ఉన్న రైతులందరూ ఒక్కసారిగా పోలీసులను ప్రతిఘటించారు. దీనితో పోలీసులు వెనక్కి తగ్గారు. మహిళలను వ్యాన్ నుంచి కిందికి దించారు.












Click it and Unblock the Notifications