జనసేనకు బిగ్ బూస్ట్: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో బోణీ
మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు ఇవ్వాళ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ వారిని ఆహ్వానించారు.
గుంటూరు: 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమౌతోన్న వేళ జనసేన పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఆవిర్భావ సభను నిర్వహించుకోవడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు మాజీ శాసన సభ్యులు ఆ పార్టీలో చేరారు. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో వారు జనసేన కండువాను కప్పుకొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామనీ హామీ ఇచ్చారు.
మంగళగిరిలో ఇవ్వాళ కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, టీవీ రామారావు జనసేనలో చేరారు. ఈదర హరిబాబు- ఒంగోలు మాజీ ఎమ్మెల్యే. 1994లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈదరకు బదులుగా ఎక్కాల తులసీరావుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు

ఇది బెడిసి కొట్టింది. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేతిలో తులసీరావు ఓడిపోయారు. 2004లో కూడా ఈదరకు టికెట్ దక్కలేదు. శిద్ధా రాఘవరావును ఒంగోలు అసెంబ్లీ బరిలో దించారు. ఆయన కూడా బాలినేని చేతిలో పరాజయాన్ని చవి చూశారు. 2009లో చంద్రబాబు అప్పటి సామాజిక వర్గ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈదర హరిబాబుకు టికెట్ ఇచ్చారు గానీ.. గెలవలేకపోయారు. బాలినేని చేతిలోనే ఓడిపోయారు.

2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా జనసేనలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా జనసేనలో చేరారు. 2009లో ఆయన టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. వైఎస్ఆర్సీపీలో చేరారు గానీ అక్కడ పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. టికెట్ వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు.












Click it and Unblock the Notifications