గుంటూరు తొక్కిసలాటపై చంద్రబాబు పేరు లేకుండా ప్రకటన.. పవన్ కల్యాణ్‌పై ట్రోల్స్..!!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట పట్ల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎక్కడే గానీ చంద్రబాబు పేరు లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ పవన్ కల్యాణ్ ను ట్రోల్ చేస్తోన్నారు నెటిజన్లు.

ముగ్గురి మృతికి కారణమైన ఘటన..
గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు.

మొన్న నెల్లూరు..
గాయపడ్డ వారిని హుటాహుటిన గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే తరహా ఘటన గుంటూరులో చోటు చేసుకోవడం, ముగ్గురు మృతి చెందడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని- రాత్రే జీజీహెచ్ కు వెళ్లారు. బాధితులను పరామర్శించారు.

కేఏ పాల్ ఫైర్..
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఉదయం బాధితులను పరామర్శించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గుందా? అంటూ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ప్రజల ప్రాణాలను హరించడానికి కూడా చంద్రబాబు వెనుకాడట్లేదని ఆరోపించారు. 2019లో ఓడిపోయిన తరువాత అయినా చంద్రబాబులో మార్పు వస్తుందని ఆశించానని, అది నిజం కాదని అన్నారు.

పవన్ కల్యాణ్ రియాక్ట్..
ఈ ఘటన పట్ల తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

పోలీసు యంత్రాంగంపైనే..
కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కూడా ఎనిమిది మంది మృతి చెందిన విషయాన్ని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో ప్రస్తావించారు. కందుకూరు ఘటన విస్మరించకముందే ఇప్పుడు గుంటూరులో తొక్కిసలాట చోటు చేసుకోవడం తనను ఆందోళనకు గురి చేసిందని చెప్పారు పవన్ కల్యాణ్. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిప్పుడు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు యంత్రాంగం తగిన భద్రత చర్యలను చేపట్టాలని సూచించారు.

నెటిజన్స్ ట్రోల్స్..
ఈ ప్రెస్ నోట్ లో చంద్రబాబు పేరును ప్రస్తావించకపోవడం నెటిజన్లను ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. ఆయనను ట్రోల్స్ చేయడానికి కారణమైంది. చంద్రబాబు స్వయంగా పాల్గొన్న కార్యక్రమమే అయినప్పటికీ- ఆయన పేరును ఇందులో పేర్కొనక పోవడం పవన్ కల్యాణ్ వైఖరిని స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications