కోడెలను కొడుకే చంపాడు: బావమరిది సంచలన ఆరోపణలు, బసవతారకం ఆస్పత్రి వివరణ ఇలా
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కోడెల శివప్రసాదరావు సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

కొడుకే హత్య చేశాడు..
కాగా, కోడెల శివప్రసాదరావు బావమరిది కంచేటి సాయి ఆయన మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని కంచేటి సాయి ఆరోపించారు. అంతేగాక, ఈ మేరకు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు.

కోడెల ఫోన్ చేసి చెప్పారు..
ఆస్తి కోసమే కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల తనకు ఫోన్ చేసి పలుమార్లు చెప్పారని ఆయన తెలిపారు.

పూర్తిస్థాయి విచారణ జరిపితేనే..
వయస్సు మీద పడిన తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని తాను కూడా శివరాంకు పలుమార్లు చెప్పానని సాయి తెలిపారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కోడెల మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపితేనే అసలు విషయం బయటపడుతుందని సాయి అన్నారు.

అపస్మారక స్థితిలో ఆస్పత్రికి..
కోడెల శివప్రసాదరావు మృతి విషయంపై చికిత్స అందించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వివరణ ఇచ్చింది. సోమవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న కోడెలను ఆస్పత్రికి తీసుకొచ్చారని, గంటసేపు చికిత్స చేసినా స్పందించలేదని వైద్యులు చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో కోడెల మరణించినట్లు ధృవీకరించామని బసవతారకం ఆస్పత్రి డైరెక్టర్ డా. వీఎస్ రావుతెలిపారు.












Click it and Unblock the Notifications