బయటకు మ్యాచింగ్ సెంటర్..లోపల వ్యభిచార కేంద్రం: గుట్టు రట్టు చేసిన గుంటూరు పోలీసులు
వ్యభిచారం దందాను ఎంత అరికట్టాలని ప్రభుత్వాలు ,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా దేశంలో ఎక్కడ చూసినా సెక్స్ రాకెట్ లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నాయి . అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా విటులకు ఎర వేస్తున్న వారు కొందరైతే , చిన్న చిన్న వ్యాపారాల ముసుగులో చీకటి దందా కొనసాగిస్తున్న వారు మరికొందరు.
బ్యూటీ పార్లర్ లు , స్పాల ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న అనేక ముఠాల గుట్టును ఇప్పటివరకు పోలీసులు రట్టు చేశారు. అయితే అలా కాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా, చీరల వ్యాపారం , మ్యాచింగ్ సెంటర్ ల పేరుతో కూడా వ్యభిచార దందా నడుస్తుందని తాజాగా ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన గుంటూరు పోలీసులు వెల్లడించారు.

చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం
చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటి అగ్రహారం జీరో లైన్ లో నివాసముండే షేక్ లాల్ బి అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే మ్యాచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మ్యాచింగ్ సెంటర్ పేరుతో చీరలు, బట్టల వ్యాపారం చేస్తున్న సదరు మహిళ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో, తన మ్యాచింగ్ సెంటర్ కు వచ్చే మహిళలను వ్యభిచార ట్రాప్ లోకి దింపుతున్నారు .

ఆర్ధిక అవసరాలు ఉన్న వారిని నిదానంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్న మహిళ
పదేళ్ల కిందట ప్రైవేటు ట్రావెల్స్ లో పని చేసే శ్రీనివాసరావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సదరు మహిళ తన షాపుకు క్రమంగా వచ్చే భర్తను కోల్పోయిన వారిని , చిన్నచిన్న కుటుంబాలకు చెందిన మహిళలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేని వారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని వారి వివరాలు తెలుసుకొని నిదానంగా వ్యభిచార కూపంలోకి నెడుతుంది . వారికి డబ్బు ఆశ చూపి ఇంట్లోనే వ్యభిచార దుకాణం నడిపిస్తోంది.

ముగ్గురు యువతులు, ముగ్గురు విటులు , నిర్వాహకురాలి అరెస్ట్
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన నగరపాలెం పోలీసులు ఈనెల 17వ తేదీన దాడి చేసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మి తో పాటుగా ముగ్గురు యువతులను, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి ఐదు వేల రూపాయల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు ,మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకే దాడులు చేశామని , ముఠా గుట్టు రట్టు చేశామని వెల్లడించారు .

వ్యభిచార దందా ఎక్కడ సాగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరిన పోలీసులు
వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ కే సుప్రజ ఈ కేసు వివరాలను వెల్లడించడంతో పాటుగా మరి ఎక్కడైనా ఇలాంటి దందా సాగుతుంటే సమాచారం అందించాలని కోరారు. వ్యభిచార దందాకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సైతం వెల్లడించారు. పోలీసులు ఎక్కడికక్కడ వ్యభిచార దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తున్నా ఇలా పోలీసులకు దొరక్కుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాలు గుంటూరు జిల్లాలో చాలానే ఉన్నాయని వాటి పైన కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.