చంద్రబాబును తిడితే ఏపీకే బీపీ-మాట్లాడుకుందాం రా- జగన్ కు లోకేష్ సవాల్
ఏపీలో నిన్న టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇవాళ వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ వైసీపీ సర్కార్ పై సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. గంజాయి స్మగ్లింగ్ తో పాటు పలు ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో జగన్ కు పెంపుడు కుక్కలను పంపడం మాని తానే టీడీపీ కార్యాలయానికి రావాలని లోకేష్ సవాల్ విసిరారు.
నిన్న జరిగిన దాడిపై సీఎం జగన్ ను లోకేష్ టార్గెట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని నారా లోకేష్ విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. నేరుగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ జగన్ కు సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా అని లోకేశ్ ప్రశ్నించారు.

ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు అధికార పక్షం సమాధానమివ్వాలనుకుంటే ఇవ్వాలని, లేకపోతే మౌనంగా ఉండాలని లోకేష్ సూచించారు. తనపై విమర్శలు చేస్తే అభిమానులకు బీపీ పెరుగుతుందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పై విమర్శలకు ఆయన అభిమానులకే బీపీ పెరుగుతుందని, కానీ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే ఏపీకే బీపీ పెరుగుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
పట్టాభి వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు వెళ్లారని, కానీ ఇవాళ టీడీపీ కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలనే అనుమతించడం లేదని పోలీసులపై లోకేష్ విమర్శలు చేశారు. పోలీసులతో వాగ్వాదం తర్వాత ఇవాళ టీడీపీ కార్యకర్తల్ని కార్యాలయంలోకి తీసుకెళ్లిన లోకేష్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత సజ్జలతో పాటు పలువురు నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసు బాస్ గౌతం సవాంగ్ పైనా లోకేష్ పదునైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications