జగన్ ఇలాకాలో టీడీపీ షాకులు- వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన ఆరోపణలు
ఏపీలో తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగింది. అయితే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలైన జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తమ సొంత గడ్డలుగా భావించే ప్రాంతాల్లో మాత్రం తమ పార్టీల్ని గట్టెక్కించలేకపోయారు. దీంతో ఇవాళ ప్రారంభమైన ఎంపీపీ ఎన్నికల ప్రక్రియపైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఇల్లు తాడేపల్లి క్యాంపు ఆఫీసు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఇవాళ దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉండగా.. అది కాస్తా కోరం లేక వాయిదా పడిపోయింది. ఇక్కడ టీడీపీ 9 ఎంపీటీసీలు గెల్చుకోగా.. వైసీపీ మాత్రం 8 ఎంపీటీసీలతో సరిపెట్టుకుంది. అయితే ఇవాళ ఎన్నికకు మాత్రం టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. దీనిపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణాైరెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తమ వైసీపీ ఎంపీటీసీల్ని ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. టీడీపీ 9 మంది ఎంపీటీసీల్ని గెల్చుకున్నా ఎన్నికకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఎంపీపీ స్ధానం బీసీ కావడం, టీడీపీ నుంచి బీసీ ఎంపీటీసీలు గెలవకపోవడంతో తమ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ ఎంపీటీసీల్ని ఆ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆర్కే ఆరోపించారు.

ఎంపీపీ పదవికి ఉదయం 10 గంటలకే నామినేషన్ సమయం ముగిసిందని, కేవలం వైసీపీ అభ్యర్ధి మాత్రమే నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. ఎంపీపీతో పాటు కోఆప్షన్ సభ్యులుగా వైసీపీ వారే ఎన్నికవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి పరిధిలోకి వచ్చే ఎంపీపీ స్ధానం వైసీపీ కోల్పోతే పెద్ద ఎదురుదెబ్బ ఖాయమని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ స్ధానంలో వైసీపీ జెండా ఎగురుతుందని ఆర్కే చేప్పేయడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న దానిపై అన్ని పార్టీల్లో క్లారిటీ వచ్చేసినట్లయింది.