లీకేజీపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్: అక్రమాలకు పాల్పడే ఉద్యోగులకు తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బీఆర్కే భవన్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ రెడ్డి సమీక్షకు హాజరయ్యారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి సబిత తేల్చి చెప్పారు. పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్ కాలేదని.. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పస్టం చేశారు. పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తేల్చి చెప్పారు.
పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్ష పేపర్ల రవాణా విషయంలోనూ మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. ఇక, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా అభినిందించారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా మంత్రి స్పందించిన విషయం తెలిసిందే.
పేపర్ లీకేజీ విషయాన్నిరాజకీయం చేయొద్దన్నారు. పరీక్షల సమయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్‌మెంట్, వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 4 లక్షల 95వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేద్దామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
మొదటిసారి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సబితా హెచ్చరించారు. విద్యార్థుల పరీక్షల సమయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని ఈ సందర్బంగా మనవి చేసుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా విద్యార్థుల పరీక్షల సమయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నానని ఆమె ట్విట్టర్ వేదికగా మంత్రి సబిత స్పష్టం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications