24 నుంచి పదో తరగతి హాల్ టికెట్లు: 3 నుంచి పరీక్షలు, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు
ఏప్రిల్ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
హైదరాబాద్: ఏప్రిల్ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సబిత శనివారం సమీక్షించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మంత్రి సబిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

కాగా, తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలవుతాయని పేర్కొంది.
ఒక్కో సబ్జెక్టులో పరీక్షలకు 80, పార్మెటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్ పేపర్లో ఫిజిక్స్, బయాలజీకి చెరి సగం మార్కులుంటాయని పేర్కొంది. సైన్స్ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించారు. మిగితా అన్ని సబ్జెక్టులకు మాత్రం 3 గంటల పరీక్షా సమయం ఉంటుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications