సికింద్రాబాద్ వెళ్లకుండా చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వీటిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అనుకున్న సమయానికి రైళ్లు గమ్యస్థానాలకు చేరుకున్నప్పటికీ ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో స్టేషన్ బయటే గంటలకొద్దీ వేచిచూడాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు 200 రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ మూడు స్టేషన్లపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ స్టేషన్ గా అధికారులను చర్లపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో టెర్మినల్ నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. తొమ్మిది ప్లాట్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభించాలనే యోచనలో అధికారులున్నారు.

దశలవారీగా 50కి పెంచుతారు
ప్రతిరోజు 50 రైళ్లను ఇక్కడి నుంచి నడిపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభంలో 25 రైళ్లు నడుస్తాయి. దశలావారీగా దీన్ని 50 రైళ్లకు పెంచుతారు. చర్లపల్లికి చేరుకునేందుకు మౌలాలి-సనత్ నగర్ మార్గం కూడా పూర్తయింది. మేడ్చల్, మల్కాజిగిరి, ఫలక్ నుమా, లింగంపల్లి ప్రాంతాల ప్రజలు ఎంఎంటీఎస్ ద్వారా నేరుగా చర్లపల్లికి చేరుకోవచ్చు. ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డుమార్గంద్వారా చర్లపల్లిని చేరుకునేందుకు కొన్ని రహదారులను విస్తరిస్తున్నారు.
మౌలాలి మీదుగా చర్లపల్లికి
కృష్ణా ఎక్స్ ప్రెస్, శాతావాహన, ఇంటర్ సిటీ, గోల్కొండ, బీదర్-మచిలీపట్నం సూపర్ ఫాస్ట్, ముంబయి-భువనేశ్వర్ కోణార్క్, కాకినాడ-షిరిడీ ట్రైవీక్లీ, కాజీపేట-పూణె ట్రైవీక్లీ, కాకినాడ-లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్, మచిలీపట్నం-షిరిడీ వీక్లీ ఎక్స్ ప్రెస్, టాటానగర్-యశ్వంత్ పూర్ వీక్లీ, లింగంపల్లి-కాకినాడ కోకనాడ ట్రైవీక్లీ, హైదరాబాద్-చెన్నై, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్, గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్, జమ్ముతావి-తిరుపతి హమ్‌సఫర్ వీక్లీ, నిజాముద్దీన్ - బెంగళూరు సిటీ రాజధాని సూపర్ ఫాస్ట్ రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించబోతున్నారు. త్వరలోనే రైళ్ల జాబితాను ప్రకటించనున్నారు. లింగంపల్లి నుంచి బయలుదేరే కొన్ని రైళ్లు సికింద్రాబాద్ వచ్చే అవసరం లేకుండా మౌలాలి మీదుగా చర్లపల్లికి చేరుకుంటాయి.












Click it and Unblock the Notifications