Hyderabad: మాదాపూర్ లో బోర్డ్ తిప్పేసిన కంపెనీ..!
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఉద్యోగాలంటూ అభ్యర్థుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కంపెనీ తమ వద్ద కోచింగ్ తీసుకుంటే మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మందిని నమ్మించిందని పలువురు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ లోని ఏ అండ్ ఏ లేక్ ఫ్రట్ భవనంలోని మొదటి అంతస్థులో కెరియర్ పీడీయా ఎడ్యుటెక్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంటుంది.
వీరు కోచింగ్ సెంటర్ తో పాటు సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకున్నారని వారు చెబుతున్నారు. తమను 3 బ్యాచులుగా విభజించారని.. ఒక బ్యాచ్ లో 70 మందిని తీసుకున్నారని పేర్కొన్నారు. కోచింగ్ ఇవ్వడం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్ష 50 వేలు తీసుకున్నట్లు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. డబ్బులు లేని అభ్యర్థులకు కంపెనీ వారు పలు ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు ఇప్పించినట్లుగా ఆరోపిస్తున్నారు.

మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పిన నిర్వాహకులు ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇప్పించలేదని చెబుతున్నారు. ఉద్యోగాలు రాకపోగా.. ఫైనాన్స్ సంస్థలు రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. దీనిపై వన్ ఇండియా కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించింది. 10, 20 మంది అభ్యర్థులు తమ సంస్థపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కంపెనీ చెందిన వారు చెబుతున్నారు. తమ కంపెనీ ఇప్పటి వరకు 100 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించినట్లు వివరిస్తుంది.
ఈ విషయమై పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు పేర్కొంది. తమ కంపెనీకి క్రెడిబిలిటీ ఉందని తెలిపింది. దీనిపై త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని.. తమ కంపెనీ తప్పుడు ప్రచారం చెయ్యోద్దని కోరింది. కాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications