Hyderabad: కల్తీలో నెంబర్ వన్ గా హైదరాబాద్..!
సాధారణంగా కవితకు కాదేదీ అనర్హం అంటారు. కానీ ఇప్పుడు కల్తీకి కాదేదీ అనర్హం అనాల్సి వస్తుంది. ప్రతీ దాన్ని కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా మన భాగ్యనగరంలో కల్తీ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1. కానీ ఇప్పుడు కల్తీలో నంబర్ వన్ అయింది. బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తించారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 19 నగరాల్లో సర్వే చేసింది. కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అయ్యాయని నివేదికలో తెలిపింది. సిటీ హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరించారు. 62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు నివేదికలో పేర్కొంది. సెంట్రల్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు.

కల్తీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా చూడడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో వంటలో వాడే కరం పొడితో పాటు చాలా పదార్థాలను కల్తీ చేస్తున్నారు. పసుపు, అల్లువెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. తాజాగా చాపత్త(టీ పౌడర్ ) కూడా కల్తీ చేస్తున్నారు. గత నెల 8న టాస్క్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లోని కోణార్క్ టీ ప్రాంగణంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ భారీ ఎత్తున కల్తీ టీ పౌడర్ సీజ్ చేశారు.
కోణార్క్ టీ వారు చాపత్తను హైదరాబాద్‌లోని వివిధ టీ స్టాల్స్‌కు ప్యాక్ చేసి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు టీ పౌడర్ లో హానికరమైన పదార్ధాలను కలుపుతున్నట్లు చెప్పారు. 300 కిలోల వదులుగా ఉండే టీ పొడి, 200 కిలోల కొబ్బరి చిప్పల పొడి, నాన్-ఫుడ్-గ్రేడ్ ఎరుపు, నారింజ రంగులు ఒక్కొక్కటి 5 కిలోలు, చాక్లెట్, ఏలకులు, పాలు వంటి కృత్రిమ రుచులను సీజ్ చేశారు. పాలు కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే ముఠాలు తరుచూ పట్టుబడుతున్నారు. అయినా కల్తీ ఆగడం లేదు.












Click it and Unblock the Notifications