సారీ చెప్పాలి: రాజీనామా చేసే దమ్ముందా? అంటూ కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
అసెంబ్లీలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
హైదరాబాద్: అసెంబ్లీలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై, బడ్జెట్‌పై చర్చలు జరపకుండా.. బీజేపీ, మోడీపై విమర్శలు చేసేందుకే సమయం కేటాయించారని ధ్వజమెత్తారు.

రాజీనామా చేసే దమ్ముందా? అంటూ కేసీఆర్‌కు బండి సవాల్
కేసీఆర్.. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని నిరూపిస్తా.. మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైం ఫిక్స్ చెయ్.. బహిరంగ చర్చకు సిద్ధం.. ఆధారాలతో నిరూపిస్తా' అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు గురించి బీఆర్ఎస్ నేతలు రైతుల వద్దకు పోయి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్న రైతులు.. బీఆర్ఎఎస్ నేతలను ఉరికించి కొడతారని అన్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా.. 56 వేల జీవోలను వెబ్‌సైట్లో పెట్టకుండా దాచిన కేసీఆర్.. మోడీ పాలన గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందో చెప్పాలని, ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదని బండి సంజయ్ నిలదీశారు.

అబ్ కీ బార్ అబ్కారీ సర్కారంటూ బండి సంజయ్ ఎద్దేవా
పహిలీ బార్ దళిత్ సర్కార్ ఎంత నిజమో.. అబ్ కీ బార్ అబ్కారీ సర్కార్ అంతే నిజమని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో అసెంబ్లీని మలినం చేసిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోంది. ప్రజలు బీఆర్ఎస్‌ను పాతిపెట్టబోతున్నారని.. 2024లో మోడీ ప్రభుత్వం పనైపోతోందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పార్టీకి ఎందుకు ఓటేయరో చెప్పిన బండి సంజయ్.. బీజేపీకి ఎందుకు ఓటేస్తారో చెప్పారు. మోడీని తిట్టడానికి, కేంద్రాన్ని బద్నాం చేయడానికి తప్ప అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిందేమీ లేదన్నారు.

ఓ జోకర్‌లా చూస్తున్నారంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
అసెంబ్లీలో అసలు బడ్జెట్ ప్రస్తావనే లేదని.. ప్రజలను దారి మళ్లించేందుకు అన్నీ అబద్ధాలు వల్లించారని బండి సంజయ్ మండిపడ్డారు. పార్లమెంటులో మోడీ ప్రసంగాన్ని ప్రపంచమంతా మెచ్చుకోవడంతో.. ఆయనతో పోల్చుకునేందుకు కేసీఆర్ నానా తంటాలు పడ్డారని ఎద్దేవా చేశారు. గతంలో తాను పార్లమెంటులో మాట్లాడితే.. తనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కదా.. ఇప్పుడు తమరు చేస్తున్నదేంటి? అని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. ఇతర రాష్ట్రాల పార్టీలు, ప్రజలు కేసీఆర్‌ను ఓ జోకర్‌లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజీనామా చేస్తే తెలంగాణకు పట్టిన శని పోతదని వ్యాఖ్యానించారు. 'నీ బిడ్డ లిక్కర్ స్కాంపై ఇంతవరకు నోరు మెదపలేదు. ఈరోజు ఎవరో పుస్తకం రాస్తే అసెంబ్లీలో చదివినిపించి.. మోడీని తిడతావా? నీపై లక్ష పుస్తకాలు రాశారు. ఎవడి పాలైందిరో తెలంగాణ అని పాటలు రాశారు. అవి చదివి అసెంబ్లీలో వినిపిస్తవా? అంటూ కేసీఆర్‌ను బండి సంజయ్ నిలదీశారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై అడ్డగోలుగా అబద్ధాలు: డిఫాల్టర్ సీఎం అంటూ ఫైర్
తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీ ఇవ్వకపోతే.. పాకిస్థాన్, చైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 80వేల పుస్తకాలు చదివిని కేసీఆర్ కు జీడీపీ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కుదేలవుతుంటే.. భారత్ మాత్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 11 స్థానం నుంచి 5వ స్థానం చేరుకున్నామన్నారు. దీనికి కారణం ప్రధాని మోడీనేనని అన్నారు. కేసీఆర్ మెచ్చుకున్న పాకిస్థాన్‌లో పిండి కోసం కొట్టుకు చస్తున్నారని.. శ్రీలంక బిచ్చమెత్తుకుంటోందని.. చైనా సంక్షోభంలో అల్లాడుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిన విషయాన్ని ఐఎంఎఫ్ చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజలు దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీలో అబద్ధాలాడారని విమర్శించారు. కేసీఆరే పెద్ద డిఫాల్టర్ సీఎం అని, ఆయన మాటలు నమ్మేదెవరు? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications