BRS.. బిగ్ స్కెచ్: వ్యవస్థాపక దినోత్సవం నాడు కీలక ప్రకటనలు
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి..ఈ నెల 27వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను నిర్వహించనుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ, వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ ఆవిర్భావ దినోత్సవాలను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా- ఈ నెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు జరుగనున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు ఈ సభలకు అధ్యక్షత వహిస్తారు. అనంతరం 27వ తేదీన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఉంటుంది.

25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఉదయం నుంచే పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 27వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారాయన. విస్తృత చర్చల అనంతరం వాటిని ఆమోదిస్తారు.
పార్టీ ఆవిర్భావ సభ, విస్తృత స్థాయి సమావేశాలను మాత్రం ఇప్పుడు నిర్వహించట్లేదని కేటీఆర్ తెలిపారు. దీనికి బదులుగా అక్టోబర్ 10వ తేదీన వరంగల్‌లో మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ పలు కీలక నిర్ణయాలను ఈ సభలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో- వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలను వెల్లడిస్తారని వివరించారు.
ఈ మహా సభను ఎన్నికల ప్రచార సభగా మార్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఏపీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను జరపనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తారని, ఈలోగా కేంద్ర కార్యాలయాన్ని ఖరారు చేస్తామని పేర్కొన్నారు కేటీఆర్.












Click it and Unblock the Notifications