Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి కోసం భారీగా తరలొస్తున్న భక్తులు..
ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలొస్తున్నారు. భక్తుల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈసారి ఖైరతాబాద్ బడ గణపతి శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ మహా గణపతికి సోమవారం తొలి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తమిళిసై పాటు హరియణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, జంధ్యం, గరిక మాలతో పాటు దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి 75 అడుగుల జంధ్యాన్ని, 75 అడుగుల కండువాను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, గరికమాలను ఐఏఎఎస్ అధికారి వెంకటేశ్, లడ్డూ, కరెన్సీ మాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్ గణపతికి అలంకరించారు. ఖైరతాబాద్ గణనాథుడిని ఇప్పటి వరకు 4 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే రోజుల్లో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

భక్తుల కోసం అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు వాలంటీర్లు అక్కడ సేవలు అందిస్తున్నారు. అటు నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో కంటే 25 శాతం ఎక్కువ విగ్రహాలు ప్రతిష్ఠించడంతో అందుకు తగినవిధంగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం కోసం ఎన్ని క్రేన్లు కావాలన్నా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మంటప నిర్వాహకులకు ఏ ప్రాంతంలో నిమజ్జనం చేయాలో ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
బారికేడింగ్, లైటింగ్, జనరేటర్లు అన్నింటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈసారి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ మీద 90 వేల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. అందురు ఒకేసారి నిమజ్జనం కాకుండా ఒక్కొక్కరిగా విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications