వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో పొడిగా.. పిల్లలు, వృద్దులు మాత్రం అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. మొన్నటి వరకు చలి గజగజ వణికిస్తే.. ఇప్పుడు పొడి వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం వేళ కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగినా..రాత్రి అయ్యే వరకు చలి పెరిగిపోతోంది. రాగల మూడు రోజుల వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ/నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఆదివారం, సోమవారం రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మంగళవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల మూడు రోజుల వరకు ఎలాంటి హెచ్చరికలు లేవన్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణను చలి వణికించింది. ఉదయం, రాత్రి వేళ్లల్లో ప్రజలు గజగజా వణికిపోయారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకారు. అయితే..ఇప్పటికే కరోనా..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ లు ప్రజలను భయపెడుతున్న క్రమంలో చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శీతాకాలంలో ఫ్లూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు చలి నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని కోరారు. లేకుంటే వారిలో త్వరగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇటు కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఒమిక్రాన్ వేళ ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాత్రి కర్ఫ్యూ విధించాయి. అన్నీ రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించిన సంగతి తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లోనూ అలాంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి వరకు ఇలాంటి సిచుయేషన్ ఉండనుంది.












Click it and Unblock the Notifications