విమానంలో మందుబాబుల వీరంగం: శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
హైదరాబాద్: మందుబాబుల వీరంగంతో ఓ విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్ నుంచి కొచ్చికి బయల్దేరిన విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు.
ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగిన విమాన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్ దారిమళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఏఐ స్టేషన్ పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది.
ఇంతకుముందు పలు విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు చిన్న చిన్న విషయాలకు పిడిగుద్దులతో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మరికొందరు తోటి ప్రయాణికులపై మూత్రం పోయడం, వాంతులు చేసుకోవడం లాంటి చేసి ఇబ్బందికరంగా పరిస్థితులను సృష్టించారు.
మరికొందరైతే విమాన సిబ్బందితో అమర్యాదగా నడుచుకుంటున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. దీంతో తాము మీ బానిసలం కాదంటూ మహిళా సిబ్బంది అలాంటి ప్రయాణికులకు ఘాటుగా సమాధానమిస్తున్నారు. గతంతో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు పనిచేసే కంపెనీ కూడా అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే, దీని తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications