Hyderabad Rains: హైదరాబాద్‍లో మళ్లీ మొదలైన వాన.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ లో గత రెండు రోజులు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున కాస్త తెరుపునిచ్చిన వాన.. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మళ్లీ మొదలైంది. మియాపూర్, నిజాంపేట, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకకట్ పల్లి, మూసపేట, బాలనగర్, సూరారం, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, కొంపల్లి, అల్వాల్, తిరుమలగిరి, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్టు, అమీర్ పేట, ఎస్సాఆర్ నగర్, మోతి నగర్, బోరబండ, యూసఫ్ గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, మెహదీపట్నం, మసబ్ ట్యాంక్, లక్డీకపూల్, అబిడ్స్, కోఠి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, రామంతా పూర్ లో వర్షం కురుస్తోంది.
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కుత్బుల్లాపూర్ లోని రెండు కాలనీల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. దీంతో కాలనీల వాసులు బయటకు రాలేకపోతున్నారు. అక్కడి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని బయటకు పంపేలా ప్రయత్నం చేస్తున్నారు. లింగపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్ లో పాత భవనం కూలిపోయింది. దానిలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

భారీ వర్షంతో రోడ్ల పైకి వర్షపు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది వాహనదారులు రోడ్లపై గంటల తరబడి ఉండాల్సి వస్తోంది. ఫోరు వీలర్ వాహనదారులు కాస్త ఇబ్బంది తక్కువగా ఉన్నా.. టూ వీలర్ వాహనదారులు మాత్రం వర్షంలోనే తడుచుకుంటూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఆఫీస్ లకు వెళ్లే వారు రోడ్లపై గంటల తరబడి ఉండాల్సి వచ్చింది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలవడంతో.. నీటిని క్లియర్ చేసేందుకు సరిపడ సిబ్బంది లేరని ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైవు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే మరో మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వానలు పడుతున్నాయని వివరించింది. పశ్చిమ జిల్లాలైన సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications