మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోదరుడి కొడుకు అరెస్ట్: ఉద్యోగాల పేరుతో రూ. కోటి మోసం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసులో అతడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలకు పాల్పడుతున్న భాస్కర్ తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఇద్దరూ నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగాలను ఇప్పిస్తామని.. 16 మంది నుంచి దాదాపు కోటి రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్ కూడా ఉన్నారు.

రైల్వేలో టికెట్ కలెక్టర్, కమర్షియల్ క్లర్క్ జాబ్ ఇప్పిస్తామని చెప్పడమే కాదు.. డబ్బులు ఇచ్చిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ , ఐడీ కార్డులను కూడా భాస్కర్ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రైల్వేలో ఉద్యోగం ఆశతో.. చాలా మంది డబ్బులను అప్పు చేసి మరీ భాస్కర్ ముఠాకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, తమకు ఉద్యోగం రావడంలేదని భాస్కర్ గ్యాంగ్‌ను తమ డబ్బులు తిరిగి ఇవ్వమని కొందరు బాధితులు అడిగారు. దీంతో నిరుద్యోగులను డబ్బులు ఇస్తానని చెప్పి.. ముంబై తీసుకెళ్లిన భాస్కర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి నకిలీ రైల్వే ఐడీ కార్డ్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications