పూలదండ తెస్తారా?: ప్రీతి సోదరి ఆగ్రహం, దుష్ప్రచారం వద్దంటూ రాజ్‌భవన్ క్లారిటీ
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పూలదండతో వచ్చారని బాధిరాలి సోదరి దీప్తి ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పూలదండతో వచ్చారని బాధిరాలి సోదరి దీప్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సోదరిని ఆస్పత్రిపాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడింది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.

పూలదండ ఎలా తెస్తారంటూ ప్రీతి సోదరి ఆగ్రహం
పూల దండలు చనిపోయిన వారికి తీసుకొస్తారని.. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించింది. బాధితురాలికి అన్యాయం చేస్తే తమ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని ప్రీతి సోదరి హెచ్చరించింది. అలాగే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థినికి సరైన వైద్యం అందడం లేదని పేర్కొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పరామర్శించడానికి రావొద్దు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి సోదరి దీప్తి డిమాండ్ చేసింది.

పూలదండపై క్లారిటీ ఇచ్చిన రాజ్‌భవన్
కాగా, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్‌భవన్ తీవ్రంగా ఖండించింది. ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూలదండ ఉంచామని స్పష్టం చేసింది. గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్ భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా ఉందని స్పష్టం చేసింది.

ప్రీతి కోసం హనుమంతుడి గుడిలో గవర్నర్ ప్రార్థన
ఈ విషయాన్ని దుష్ప్రచారం చేయడం, విపరీతార్థాలు తీయడం సరికాదని రాజ్ భవన్ పేర్కొంది. హనుమంతుడి గుడిలో బాధితురాలు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ప్రార్థించారని తెలిపింది. గవర్నర్ రాజ్ భవన్ కు వచ్చిన వెంటనే ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆదేశించారని తెలిపింది. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలని రాజ్‌భవన్ విజ్ఞప్తి చేసింది. కాగా, గురువారం ప్రీతిని గవర్నర్ తమిళిసై పరామర్శించిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మాహత్యాయత్నం బాధాకరమని అన్నారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలని అన్నారు.












Click it and Unblock the Notifications