Hyderabad Rains: హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అనవసరంగా బయటకు రావొద్దు..
శనివారం రాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ లో అత్యధికంగా 37 మి.మీ వర్షపాతం నమోదు అయింది. ఆదివారం ఉదయం కూడా నగరంలో ముసురు కొనసాగుతోంది. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్24 గంటలూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సిటీలోని 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్టాటిక్, మాన్సూన్ టీమ్స్ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు చేరుతోంది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ కుడా భారీగా వరద వస్తోంది. గండిపేట జలాశయానికి వరద పోటెత్తుతోంది. సోమవారం కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికతో హైదరాబాద్ కలెక్టర్ సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.శనివారం సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ శాంతి కుమారితో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications