హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తున్నారా?: ఐతే పర్సు ఖాళీనే!
హైదరాబాద్ నగరంలో ఆకర్షణీయంగా నిలుస్తోన్న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు, వాహనాల పార్కింగ్ పెరిగిపోయిన క్రమంలో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
హైదరాబాద్: నగరంలో ఆకర్షణీయంగా నిలుస్తోన్న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు, వాహనాల పార్కింగ్ పెరిగిపోయిన క్రమంలో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. మరోసారి కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలపాలంటే భయపడేలా జరిమానాలు విధించనున్నారు.
కేబుల్ బ్రిడ్జిపై బైక్ లేదా కారు ఆపినా, పార్క్ చేసినా.. కనీసం రూ. 200 నుంచి రూ. 2వేల వరకు జరిమానా విధించనున్నారు. అంతేగాక, ఈ జరిమానాను అక్కడికక్కడే వసూలు చేయనున్నారు. ఇక డబ్బులు లేవంటే చలానా పంపిస్తారు. పగలు, రాత్రి, రద్దీ లేని సమయాల్లోనూ కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా ఈ మేరకు జరిమానా విధించనున్నారు ట్రాఫిక్ పోలీసులు.

అంటే కేబుల్ బ్రిడ్జిపై 24 గంటలపాటు ఈ నిబంధనలు అమలులోనే ఉంటాయి. ఎవరూ లేరు కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే.. కేబుల్ బ్రిడ్జి వద్ద అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
ఇటీవల కాలంలో కొందరు యువకులు కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలు కూడా చేసుకోవడం గమనార్హం. ఈ సమయాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కేబుల్ బ్రిడ్జిపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండటంతో పోలీసులు కఠని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక భారీ జరిమానాలతో కేబుల్ బ్రిడ్జి వాహనాల పార్కింగ్‌ను నియంత్రించనున్నారు.












Click it and Unblock the Notifications
