ఉపఎన్నిక ఎఫెక్ట్: హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ బదిలీ: కొత్గ కమిషనర్‌గా వెంకన్న
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక త్వరలో జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా, ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ తోపాటు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌ను కూడా బదిలీ చేసింది.
హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మిర్యాలగూడ కమిషనర్ వెంకన్నను నియమించింది. ఇక జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌గా మీర్‌పేట్ కార్పొరేషన్ కమిషనర్ సుమాన్ రావుకు బాధ్యతలు అప్పగించింది.

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గానికి మరికొన్ని రోజుల్లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో కమిషనర్ మార్పు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధికార పార్టీ నేతలు, అధికారులు హుజూరాబాద్ నియోజవకర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దళితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తామంటూ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని ఇటీవల ప్రకటించడం గమనార్హం. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కేసీఆర్ సర్కారు కురిపించే వరాల గురించి చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరిగి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తాను చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. తాము మధ్యాహ్న భోజనం కోసం తీసుకొచ్చుకున్న వంట సామాగ్రిని కూడా ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారని చెప్పారు. అంతేగాక, ఓ మంత్రి తనను హత్య చేయించేందుకు కూడా కుట్ర పన్నారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications