Hyderabad: ప్రయాణికులతో కిటకిటలాడుతున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాడికి పెరిగింది. ఇక మంగళవారం మరింత భారీగా ప్రయాణికులు చేరడంతో విమానాశ్రయం కిటకిటలాడుతోంది. ఉన్నత చదువుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు విదేశాలకు వెళ్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రద్దీ ఏర్పడింది.
రోజూ 50 వేల మంది డొమెస్టిక్, 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ఉన్నత విద్య కోసం రోజూ విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 5వేల వరకు ఉంది. ముఖ్యంగా అమెరికా, కెనడాకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నారు.

కాగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అమెరికా, కెనడాలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో గత రెండు వారాలుగా శంషాబాద్ విమానాశ్రయంకు రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది వస్తున్నారు. రోజుకు 70 వేలకు పైగా కార్లు వస్తున్నాయి. విమానాశ్రయానికి వచ్చే వాహనాలతో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వీడ్కోలు పలికేందుకు నలుగురికి మించి రావొద్దని విమానాశ్రయం అధికారులు ఇప్పటికే సూచించారు. అంతేగాక, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 20 వరకు విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో సందర్శకులకు కూడా అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఆగస్టు 28వ తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని పేర్కొన్నారు. మరోవైపు, విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యాక్సెస్ రోడ్డు, ర్యాంపులలో రద్దీ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళుతున్నవారి వెంట ఎక్కువ సంఖ్యలో బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రావద్దని ఇటీవల శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు. ఒక ప్రయాణికుడి వెంట 10 నుంచి 15 మంది వరకు వస్తుండటంతో ఎయిర్ పోర్టులో రద్దీ పెరుగుతోందన్నారు. దీంతో సెక్యూరిటీ సమస్యతోపాటు పార్కింగ్ సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. అందుకే, ఒక ప్రయాణికుడి వెంట ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎయిర్ పోర్టుకు రావాలని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications