హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పులు చేసింది యాజమాన్యం. ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా తెలియజేశారు.
ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా ట్రయల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. తాజాగా, శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇటీవల వచ్చిన వార్తనలు ఖండించిన మెట్రో
ఇటీవల మెట్రో సమయాలను పొడిగించినట్లు వచ్చిన వార్తలను మెట్రో యాజమాన్యం ఖండించింది. శుక్రవారం రాత్రి నుంచి మెట్రో సర్వీసులు అదనపు గంటల్లో పనిచేయనున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటాయని వాటి సారాంశం.
ఇంకా, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను మెట్రో యాజమాన్యం ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. తాజాగా, సోమవారం, శుక్రవారాల్లో మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications