హైదరాబాద్‌లో భారీ వర్షాలకు బాలిక బలి
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలను వణికించింది. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాన్ని కలిగించింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
గంట వ్యవధిలోనే 7.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యధిక వర్షపాతం హిమాయత్‌నగర్, శేరిలింగంపల్లిల్లో నమోదైంది. హిమాయత్ నగర్- 7.8, శేరి లింగంపల్లి- 7.4 వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి, ముషీరాబాద్, నాంపల్లిలో ఆరు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఉప్పల్, ఆసిఫ్‌నగర్, బాలానగర్‌లో అయిదు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసినట్లు చెబుతున్నారు.

ఈ వర్షం- ఓ చిన్నారిని బలి తీసుకుంది. నాలాలో పడి ఓ బాలిక మృతి చెందింది. ఆ చిన్నారిని మౌనికగా గుర్తించారు. సికింద్రాబాద్ కళాసిగూడలో బాలిక నివాసం ఉంటోంది. ఈ తెల్లవారు జామున పాలను తీసుకుని రావడానికి బయటికి వెళ్లిన బాలిక నాలాలో పడి కొట్టుకుపోయింది. స్థానికులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులకూ సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మౌనిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పార్క్ లేన్ సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలిక మరణించిందంటూ స్థానికులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications