Hyderabad: ఎయిర్‌పోర్ట్ మెట్రోకు మరో ముందడుగు
హైదరాబాద్: మెట్రో విస్తరణ పనులు క్రమంగా ముందుకు సాగుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం మెట్రో నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ మెట్రోకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్ డీబీ ఇంజినీరింగ్ సంస్థల కన్సార్టియం ఎంపికైంది. జీఈ కన్సల్టెంట్ ఎంపికకు సంబంధించి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
జనరల్ కన్సల్టెంట్ ఎపిక కోసం మొత్తం ఐదు అంతర్జాతీయ కన్సార్టియంలు పోటీపడ్డాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, పురపాలక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణరావు, అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తోపాటు ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ వాటిని పరిశీలించింది. ఐదు కన్సార్టియంల సాంకేతిక సామర్థ్యం, వారి అనుభవం పరిగణలోకి తీసుకుని కన్సార్టియంను ఎంపిక చేశారు.

సిస్ట్రా కన్సార్టియంకు అన్ని అర్హతలు ఉండటంతో టెండర్ లభించిందని మెట్రో రైల్ ఎండీ తెలిపారు. సాంకేతికంగా అత్యధిక మార్పులు పొందడంతోపాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు అందరికంటే తక్కువ మొత్తంలో రూ. 98.54 కోట్లు కోట్ చేసినట్లు వెల్లడించారు. కన్సార్టియంలోని మూడు సంస్థలు ప్రజా రవాణా రంగంలో.. ముఖ్యంగా మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న సంస్థలుగా కీర్తి ఘడించాయని తెలిపారు.
ఫ్రాన్స్ కు చెందిన సిస్ట్రా, భారతీయ రైల్వేలకు చెందిన రైట్స్, జర్మనీకి చెందిన డీబీ సంస్థలకు ప్రముఖ ఇంజినీరింగ్ దిగ్గజాలు పేరుండటం గమనార్హం. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో నిష్ణాతులైన 18 మంది ఇంజినీరింగ్ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజినీర్లు తదితర సిబ్బందిని కన్సర్టియం సమకూర్చుతుంది. ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని, ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్ డాక్యుమెంట్లను త్వరలో తయారు చేస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరించనున్నారు.












Click it and Unblock the Notifications