హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్: ఈ విధానం: ఏంటీ? ఎందుకు అవసరం?
హైదరాబాద్: నగరంలో రోజు రోజుకు వాహనాలు పెరుగుతుండటంతో.. రహదారులపై బారులు తీరుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఐటీ కంపెనీలతో సమీక్ష సమాశం నిర్వహించారు.
రహదారులపై వాహనాల రద్దీని తగ్గించేందుకు ఐటీ సంస్ధలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేశారు. అదే విధంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఐటీ కంపెనీలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నగరంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని ఆదేశించారు. మంగళ, బుధ, గురువారాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని ఐటీ కంపెనీలు దీని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

ఐటీ కంపెనీలు సొంత రవాణా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని వల్ల కాస్త వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. ఉద్యోగులు అంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పని వేళల్లో మార్పు చేయాలని సూచించారు. వీటితో పాటు వర్క్ ఫ్రమ్ హోంను ఐటీ కంపెనీలు పరిశీలించాలని కోరారు. ఈ చర్చలో టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో ప్రతినిధులతో పాటు ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు.
అసలీ కార్ పూలింగ్ విధానం అంటే.. కారులో ప్రయాణాన్ని పంచుకోవడం. ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది ఒకే కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా నియంత్రణలో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి సారిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణిస్తున్నారు. ఒక్కరిద్దరి కంటే ఎక్కువ మంది ఆ కార్లలో ప్రయాణం చేయడం లేదు. అందుకే, సొంత కార్లలో కూడా ఒక్కరిద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణం చేసేలా చూసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో అనేక కార్లు రహదారులపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అందుకే కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది.
ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానం అమలైతే సగానికి సగం ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంచనా వేస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో వందలాది ఐటీ కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందుకే ఈ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుండటంతో కార్ పూలింగ్ విధానం అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications