కేసీఆర్ ఇంటర్నేషనల్ పార్టీ పెట్టిన ఫర్లేదు, పొత్తు మాత్రం లేదు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. తిమ్మాపూర్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. మీడియా ప్రతినిధులు వేసిన 16 ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పారు. ఆర్ఎస్ఎస్ కబంధహస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పొత్తు లేదు..
టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదు, ఉండబోదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ఆ పార్టీ నేతలే పొత్తు అని మాట్లాడారని గుర్తుచేశారు.తాము ఎలాంటి ముందడుగు వేయలేదని చెప్పారు. పార్టీ విస్తరణ చేయడం అధినేతల లక్ష్యం, ఆశయం అవుతుందని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు. అవసరమైతే ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టుకోవచ్చని తెలిపారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అవసరమైతే చైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు అని సెటైర్లు వేశారు. ఐక్యరాజ్యసమితిలో తమ పార్టీ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.

డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయ్
పార్టీ విస్తరణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని రాహుల్ గాంధీ అడిగారు. అదంతా అవినీతి సొమ్మేనని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలకు అవినీతి సొమ్ము ఎక్కువ అని చెప్పారు. అందుకోసమే ఎన్నిక, ఉప ఎన్నికలో వందల కోట్లు పంచుతున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోందని తెలిపారు. నితీశ్‌తో టీఆర్ఎస్ పార్టీ జట్టుకడితే ప్రాబ్లం లేదని తెలిపారు.

ద్వేష రాజకీయాలు
విద్వేష రాజకీయాలు దేశానికి మంచిది కాదన్నారు. బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల కోసం పనిచేస్తోందని తెలిపారు. జనాల కోసం పనిచేయడం లేదన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చూసుకుంటారని వివరించారు. రేపు మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని ప్రెస్ మీట్ ఎండింగ్‌లో జైరాం రమేశ్ తెలిపారు. ఆయన రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని వివరించారు. ఎంతసేపు పాల్గొంటారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు నిరాకరించడంతో అధ్యక్ష పదవీకి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications