Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్.. కొత్త కోచ్ లు లేవంటా..!
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఈ మధ్య తరుచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సోమవారం కూడా మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్య ఏర్పడింది. మెట్రో రైలులో సాంకేతిక సమస్య రావడంతో రైల్వే స్టేషన్ లో రైలు 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్తుండగా హైదరాబాద్ మెట్రో రైలు బేగంపేట స్టేషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు ఆగిపోయింది. గత జూన్ 5 తేదీన కూడా మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు.
మెట్రో రైళ్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు వస్తుంటాయని పేర్కొన్నారు. మీడియా ఇలాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తుందని చెప్పారు. ప్రపంచంలో సక్సెస్ అయిన మెట్రోలలో హైదరాబాద్ మెట్రో ఒకటిగా నిలిచిందని ఎన్వీఎస్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశపై ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. రూ. 24,269 వేల కోట్ల రూపాయలతో రెండవ దశ మెట్రో పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట ప్రధాన జంక్షన్ అవుతుందని వివరించారు.

గత 8 ఏళ్లలో కొత్త మెట్రో రాకపోవడం వల్ల హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి చేరిందని.. రెండో దశ మెట్రో పూర్తయితే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. మెట్రో కోచ్ ల పై కూడా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. మెట్రో కొత్త కోచ్ లు ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు. త్వరలో నాగపూర్ నుంచి మెట్రో కోచ్ లను అద్దె ప్రాతిపదికన తీసుకురానున్నట్లు ప్రకటించారు. మెట్రో నిర్మించడం సులవైన పని కాదని.. 2010లో బిడ్ ప్రాసెస్ కి వెళ్తే.. ఈరోజు ఈ పరిస్థితి చూస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండో దశకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండో దశలో 5 మార్గాల్లో మెట్రో రైలు ట్రాక్ వేయనున్నారు. ఇందులో రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, నాగోలు నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు మెట్రో పనులు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications